అమరావతి నిర్మాణ (Amaravati Construction) వ్యయంపై మరోసారి పెద్ద ఎత్తున రాజకీయ చర్చ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం (Central Government) నిర్మించబోయే భవనాల చదరపు అడుగు (Square Foot) ఖర్చుకు.. రాష్ట్ర ప్రభుత్వం (State Government) కేటాయిస్తున్న ఖర్చుకు పొంతన లేకపోవడమే ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. కేంద్ర కేబినెట్‌లో అమరావతిలో భారీ భవనాల నిర్మాణానికి నిధులు(Funds) కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణ వ్యయాలపై విమర్శలు గుప్పించడానికి ప్రతిపక్షాలకు, విశ్లేషకులకు సరికొత్త ఆయుధమైంది.
అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు(Central Government Offices), నివాస సముదాయాల (Residential Complexes) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా రెండు ప్రధాన ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్ (CGGPOA) కోసం మొత్తం రూ. 1,299 కోట్లు కేటాయించింది. 23.25 లక్షల చదరపు అడుగులు నిర్మాణ వైశాల్యానికి గానూ ఒక్కో చదరపు అడుగు ధర కేవలం రూ. 5,587గా కేటాయించింది. ఈ ప్రాజెక్టు 5.53 ఎకరాల స్థలంలో జి+13, జి+10 అంతస్తులతో రెండు అత్యాధునిక టవర్ల నిర్మాణం, అత్యున్నత ప్రమాణాలతో నిర్మించనున్నారు.
అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ (GPRA) నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం రూ. 1,235 కోట్లు కేటాయించింది. అంటే 31.30 లక్షల చదరపు అడుగుల నిర్మాణ వైశాల్యంతో కూడిన ఈ భవనాలకు చదరపు అడుగు ధర కేవలం రూ. 3,946గా నిర్ణయించింది. 17 ఎకరాల విస్తీర్ణంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మొత్తం 1,504 క్వార్టర్ల (నివాసాల) నిర్మాణం చేపట్టనుంది.

రూ. 5,500 ఎక్కడ? రూ. 18,000 ఎక్కడ?
కేంద్ర ప్రభుత్వ నిధుల కేటాయింపు, చదరపు అడుగుకు నిర్ణయించిన ధరతో పోలిస్తే ఇక్కడే అసలు విషయం బయటపడుంది. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు అంతర్జాతీయ ప్రమాణాలతో, 4-స్టార్ రేటింగ్‌తో నిర్మించే కార్యాలయాలకే చదరపు అడుగుకు రూ. 5,587 మాత్రమే ఖర్చు పెడుతుంటే.. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో నిర్మించే ప్రభుత్వ కార్యాలయాలకు చదరపు అడుగుకు రూ. 18,000 పైగా ఖర్చు చూపించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక చదరపు అడుగు భవన నిర్మాణానికి రూ. 4 వేల నుండి రూ. 5,500 లోపే అవుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వ భవనాలకు అంతకంటే మూడు రెట్లు ఎక్కువగా రూ. 18 వేల వరకు ఖర్చు చూపించడం వెనుక భారీ అవకతవకలు, దోపిడీ దాగి ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ రెండు భవన నిర్మాణాల అంచనాలను పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వ అంచనాల పెంపు, అవకతవకలు స్పష్టంగా అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాజధాని నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చూపిస్తూ, టెండర్లలో రేట్లను భారీగా పెంచి ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేస్తున్నారనే విమర్శలకు కేంద్ర ప్రభుత్వ తాజా కేటాయింపుల లెక్కలే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కేంద్ర ప్రాజెక్టుల రాకతో అమరావతి అభివృద్ధి Amaravati Development) చెందుతుందనే సంతోషం ఒకవైపైతే.. అదే కేంద్రం ఇచ్చిన అధికారిక ఖర్చుల వివరాలు రాష్ట్ర ప్రభుత్వ “అమరావతి దోపిడీ”ని (“Amaravati Scam) బట్టబయలు చేశాయనే చర్చ హాట్ టాపిక్‌గా మారింది.








