పోలీసుల అధికార దుర్వినియోగం (Police Authority Misuse), రాజకీయ కక్షసాధింపు (Political Vendetta) చర్యలపై మాజీ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఆప్తమిత్రుడు తానినేని రాంబాబు(Thanineni Rambabu), ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని పోలీసులు సాగిస్తున్న మానవహక్కుల ఉల్లంఘనలపై ఆయన నేరుగా జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)కు ఫిర్యాదు చేశారు. నిబంధనలను తుంగలో తొక్కి, సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలను ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాజకీయ కక్షసాధింపులో భాగంగానే తానినేని రాంబాబుపై అక్రమ కేసులు (Illegal Cases) బనాయించారని కేశినేని నాని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాంబాబును మానసికంగా, శారీరకంగా వేధించాలనే దురుద్దేశంతోనే పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని మండిపడ్డారు. సిటీ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ (City Task Force SI) నవీన్ (Naveen) తన పరిధిని దాటి రాంబాబు కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపించారు. FIR నమోదు కాకముందే రాంబాబుతో పాటు ఆయన వృద్ధురాలైన తల్లిని కూడా పోలీసులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ వేధించారని ధ్వజమెత్తారు.
విచారణ అనే పేరుతో ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా రాంబాబును పటమట పోలీస్ స్టేషన్లో (Patamata Police Station) 11 గంటల పాటు అక్రమంగా నిర్బంధించారని కేశినేని నాని వెల్లడించారు. రాంబాబు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ పోలీసులు అత్యంత అమానుషంగా ప్రవర్తించారని మాజీ ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఏదైనా విచారణ లేదా అరెస్ట్ ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలను విజయవాడ పోలీసులు పూర్తిగా గాలికి వదిలేశారని కేశినేని నాని మండిపడ్డారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని చట్టవిరుద్ధంగా నిర్బంధించి వేధించడం ద్వారా ఆయన ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే పరిస్థితి తెచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జాతీయ మానవ హక్కుల కమిషన్ను (National Human Rights Commission – NHRC) కేశినేని నాని కోరారు.








