సెలబ్రిటీల ముసుగులో జరిగిన ఒక భారీ వీసా మోసం (Visa Fraud) ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ యూట్యూబర్ (YouTuber), నటి రమానందన (Ramanandana) (అలియాస్ నందు) కుటుంబ సభ్యులు వీసా రెన్యూవల్ (Visa Renewal) పేరిట లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక బాధితుడి ఫిర్యాదుతో కన్సల్టెన్సీ(Consultancy) పేరిట సాగుతున్న ఈ మోసపూరిత వ్యవహారం బయటపడింది.
ఎన్టీఆర్ జిల్లా (NTR District) ఇబ్రహీంపట్నానికి చెందిన మామిళ్ళపల్లి శివక్రాంతి కుమార్ (Mamillapalli Sivakranti Kumar) యూకేలో ఉన్నప్పుడు వీసా గడువు ముగిసిపోతుండటంతో, ఆయన వీసా రెన్యూవల్ కోసం ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ (Destiny Consultancy) నిర్వాహకులను ఆశ్రయించాడు. ఇండియాలోని(India) తమ బ్రాంచ్‌లో డబ్బులు చెల్లిస్తే వీసా ప్రాసెస్ సులభంగా పూర్తి చేస్తామని కన్సల్టెన్సీ నిర్వాహకులు అతనికి నమ్మబలికారు. వాళ్ల మాటలు నిజమేనని నమ్మిన బాధితుడు విడతల వారీగా రూ. 15 లక్షల వరకు చెల్లించాడు.
డబ్బులు తీసుకుని నెలలు గడుస్తున్నా వీసా రాకపోవడంతో పాటు, కన్సల్టెన్సీ నుంచి సరైన సమాధానం లేకపోవడంతో తాను మోసపోయానని శివక్రాంతి కుమార్ గ్రహించాడు. ఇండియాకు చేరుకున్న తరువాత బాధితుడు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ వీసా స్కామ్‌లో డెస్టినీ కన్సల్టెన్సీకి సంబంధమున్న జాగర్లమూడి మధుకర్ (Jagarlamudi Madhukar) (డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్), రమానందన (Ramanandana) అలియాస్ నందు(Nandu) (మధుకర్ భార్య), గుంటూరులో నివసించే మధుకర్ తండ్రిపై క్రైమ్ నంబర్ 515/2025 కింద కేసు నమోదు చేశారు.
సెలబ్రిటీ హోదా, యూట్యూబ్ ఇమేజ్‌ను అడ్డం పెట్టుకుని ఈ కన్సల్టెన్సీ ద్వారా ఇంకా చాలా మందిని మోసం చేసి ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠా వలలో చిక్కి మోసపోయిన మిగిలిన బాధితుల వివరాలను కూడా సేకరిస్తున్నట్లు, త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.








