సీఎం కుర్చీపై పవన్ కళ్యాణ్‌కు ‘క్లారిటీ’ వ‌చ్చిందా..?

సీఎం కుర్చీపై పవన్ కళ్యాణ్‌కు ‘క్లారిటీ’ వ‌చ్చిందా..?

Summarize with AI

హైదరాబాద్ ప్రెస్‌మీట్‌లో (Hyderabad Press Meet) జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపాయి. “నాకు ఆంధ్రాలోనే దిక్కు లేదు.. తెలంగాణలో (Telangana) ముఖ్యమంత్రి (Chief Minister) అవుతానా?” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యానం కేవలం ఒక సాధారణ ప్రకటన కాదు, దాని వెనుక బలమైన రాజకీయ కార‌ణం ఉంద‌నే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏపీలోనే(AP) అధికారం కోరుకోని వాడిని, తెలంగాణలో (Telangana) ఇంకేం కోరుకుంటాను అనడం వెనుక పవన్ అంతరార్థం ఏంటి? ఎలాగూ సీఎం (CM) కుర్చీపై మ‌రో నేత క‌న్నుప‌డింద‌ని, ఆయన చూపు ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు మళ్లుతోందా?

ఎన్నికల సమయంలో “మీరు ఓట్లు వేస్తే సీఎం అవుతా” అని క్యాడర్‌ను ఉత్సాహ‌ప‌రిచిన‌ పవన్ కళ్యాణ్, ఇప్పుడు త‌న మాట‌ మార్చాడు. ప్రస్తుతం ఏపీలో(AP) తెలుగుదేశం(TDP), జనసేన(Jana Sena), బీజేపీ(BJP) కూటమి ప్రభుత్వం నడుస్తోంది. చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సీఎంగా ఉన్న తరుణంలో, ఆ సీటును ప‌వ‌న్ ద‌క్కించుకోవ‌డం అసాధ్యం. జనసేనకు ఉన్న బలంతో ఒంటరిగా 175 అభ్య‌ర్థుల‌ను పోటీకి దించ‌లేమ‌ని, అది సాధ్యం కానిప‌ని అనే స్పష్టత పవన్‌కు వచ్చింది.

అందుకే, అనవసరమైన ఆశలు కల్పించడం కంటే గ్రౌండ్ రియాలిటీని (Ground Reality) ఒప్పుకోవడమే బెటర్ అని ఆయన భావించి ఉండవచ్చు. కానీ త‌మ నాయ‌కుడు సీఎం కావాల‌ని, త‌మిళ‌నాడులో (Tamil Nadu) విజ‌య్(Vijay) మాదిరిగా సీఎం సీట్లో కూర్చోవాల‌ని కోరుకున్న అభిమానుల ఆశ‌ల‌పై ప‌వ‌న్ నిన్నటి మాట‌ల‌తో నీళ్లు చ‌ల్లేసిన‌ట్టే అంటున్నారు.

లోకేష్ పట్టాభిషేకం.. పవన్ రూట్ చేంజ్?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ(TDP) తదుపరి వారసుడిగా నారా లోకేష్‌ను(Nara Lokesh) చంద్రబాబు నాయుడు ప్రొజెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే లోకేష్‌కు సీఎం కుర్చీ దక్కవచ్చనే ప్రచారం టీడీపీ శ్రేణుల నుంచే బలంగా వినిపిస్తోంది. ఆ పార్టీ శ్రేణుల కోరిక కూడా అదే. ఈ నేప‌థ్యంలో సీఎం కుర్చీపై ఇక ఆశ‌లు పెట్టుకోవద్ద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక క్లారిటీకి వ‌చ్చిన‌ట్టుగా తెలుస్తోంది. అందుకే నిన్న‌టి తెలంగాణ ప్రెస్‌మీట్‌లో ఏపీలోనే దిక్కులేద‌న్న వ్యాఖ్య‌ల‌తో స్ప‌ష్టం చేశారంటున్నారు విశ్లేష‌కులు. 15 ఏళ్లు కూట‌మి క‌లిసి ఉండాల‌ని ప‌దే ప‌దే విజ్ఞ‌ప్తి చేస్తున్న ప‌వ‌న్‌.. సీఎం కుర్చీపై మాత్రం నీరుగార్చే మాట‌లు మాట్లాడ‌డంపై జ‌న‌సైనికులు నిరాశ‌గా ఉన్నారు.

పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణాన్ని గమనిస్తే ఆయన భావజాలంలో పెద్ద మార్పులే కనిపిస్తాయి. రాజ‌కీయ పార్టీ ఆరంభంలో చెగువేరా సిద్ధాంతాలు, కమ్యూనిస్ట్ భావజాలం అని చెప్పి సీపీఐ, సీపీఎంలతో నడిచారు. మధ్యలో సనాతన ధర్మం నినాదాన్ని ఎత్తుకున్నారు. బీజేపీకి దగ్గరైన త‌రువాత స‌నాతన ధర్మ రక్షణ, హిందూత్వ నినాదాలను ప‌టిస్తున్నారు.

ఈ మధ్య కాలంలో ఆయన ప్రసంగాల్లో ‘నేను, నా దేశం, దేశ సేవ’ అనే జాతీయవాద ధోరణి ఎక్కువగా వినిపిస్తోంది. ప్రపంచీకరణ, దేశ భద్రత, జాతీయ ప్రయోజనాల గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఈ మార్పులన్నీ ఆయనను జాతీయ స్థాయి నాయకుడిగా త‌న‌ను తాను ప్రొజెక్ట్ చేసుకునే ప్రక్రియలో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏపీలో ఎలాగూ సీఎం అయ్యే అవకాశాలు ప్రస్తుతానికి తక్కువగా ఉండటం, మరోవైపు జాతీయవాదం వైపు మొగ్గు చూపుతుండటంతో.. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఏపీని వ‌దిలి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా అటు సినిమాలకు, ఇటు రాజకీయాలకు సమన్యాయం చేయవచ్చని భావిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

హైదరాబాద్ వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు జ‌న సైనికులను ఒక‌ర‌కంగా కుంగ‌దీశాయి. సీఎం కుర్చీ జ‌న‌సేనానికి ద‌క్క‌ద‌ని స్వ‌యంగా ఆయ‌న మాట‌ల ద్వారానే అర్థం చేసుకోవ‌చ్చు అంటున్నారు. మొత్తానికి ఆయన “సీఎం కుర్చీ” వ్యాఖ్యలపై అంత క్లారిటీగా ఉన్నారనేది వాస్తవం. మరి జనసేనాని వేస్తున్న ఈ ‘జాతీయ వాదం’ అడుగులు ఆయనను ఏ తీరానికి చేరుస్తాయో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment