“ఇంధన పొదుపు పాటించాలి.. పొదుపు మంత్రం జపించాలి.. నా దేశం-నా బాధ్యత..” ఇవీ ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కేబినెట్, బహిరంగ సభల్లో పదే పదే ఉద్ఘాటించిన మాటలు. ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) పిలుపు మేరకు తానే స్వయంగా తన కాన్వాయ్‌ని (Convoy) తగ్గించుకున్నానని ప్రకటించుకున్నారు. అయితే, ఈ ‘పొదుపు మంత్రం'(Savings Mantra)కేవలం మూన్నాళ్ల ముచ్చటేనా? అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.
కేబినెట్‌లో (Cabinet) పొదుపు చర్యలపై సుదీర్ఘంగా చర్చించిన కొద్దిరోజులకే, ప్రభుత్వం మళ్లీ పాత బాటలోనే పయనిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ‘యోగాంధ్ర-2026′(Yogandhra-2026) పేరుతో వందల కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవ్వడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. గతేడాది లాగే ఈ ఏడాది కూడా జూన్ 7 నుంచి రెండు వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా యోగా కార్యక్రమాలు (Yoga Programs) నిర్వహించాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ కార్యక్రమాల్లో దాదాపు కోటి మందిని భాగస్వాములను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
జూన్ 21న అమరావతిలోని (Amaravati) కృష్ణా నది వంతెన (వెస్ట్ బైపాస్) పై ఏకంగా 25 వేల మందితో రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికి సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) స్వయంగా హాజరుకానున్నారు. యోగా ప్రచారం కోసం ‘ఏపీ యోగా ప్రచార పరిషత్'(AP Yoga Prachara Parishat) ఏర్పాటుకు సీఎం ఆమోదం తెలపడం, దీనికి సంబంధించిన నిధుల విడుదల కోసం ఆర్థిక శాఖ నుంచి త్వరలోనే ఉత్తర్వులు వస్తాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satyakumar Yadav) ప్రకటించడం సంచలనంగా మారింది.
గతేడాది ‘యోగాంధ్ర’ పేరుతో దాదాపు రూ. 300 కోట్లకు పైగా ప్రజాధనాన్ని ఖర్చు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో జరిగిన అరకొర ఏర్పాట్లు, మ్యాట్‌లు, టీ-షర్టుల కోసం హాజరైన జనం తన్నులాడుకున్న దృశ్యాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు మళ్లీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రంలో ఈవెంట్లు, పబ్లిసిటీల పేరుతో వందల కోట్లు కుమ్మరించడం ఎంతవరకు సమంజసమని విపక్షాలు, సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
“ఒకవైపు రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని చెప్తూనే, మరోవైపు ఇలాంటి భారీ ఈవెంట్లకు కోట్ల రూపాయలు ఎలా కేటాయిస్తారు?” అని నిలదీస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మంత్రి నారా లోకేష్‌లు(Nara Lokesh) పొదుపు పాటించాలని హితబోధలు చేస్తూనే.. మరోవైపు స్పెషల్ ఫ్లైట్లు, భారీ కాన్వాయ్‌లతో తిరుగుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, ప్రభుత్వ సభల కోసం వందలాది ఆర్టీసీ, ప్రైవేట్ స్కూల్ బస్సులను ఉపయోగించి జనసమీకరణ చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు.
ప్రధాని మోడీ పేరు చెప్పి కాన్వాయ్‌లు తగ్గించుకోవడం కేవలం ఒక ‘మొక్కుబడి’ చర్యగానే మిగిలిపోయిందా? పబ్లిసిటీ కోసం కొన్ని రోజులు పొదుపు డైలాగులు చెప్పి, వారం తిరక్కుండానే మళ్లీ పాత దుబారా బాట పట్టారా? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్యం కోసం యోగా మంచిదే అయినా, ఆర్థిక సంక్షోభంలో ఉన్న తరుణంలో వందల కోట్ల ప్రజాధనాన్ని ఇలాంటి ఆడంబరాలకు ఖర్చు పెట్టడం సమంజసమేనా..? అన్న ప్రజలు నిలదీస్తున్నారు.








