ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ‘మెగా డీఎస్సీ'(Mega DSC) పేరుతో ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని, ఈ ప్రక్రియలో భారీగా అవినీతి (Corruption) జరిగిందని వైసీపీ(YSRCP)యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా (Jakkampudi Raja) ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ భర్తీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, వైసీపీ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు (Nara Chandrababu Naidu), మంత్రి లోకేష్‌పై(Nara Lokesh) జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
“బాబు వస్తే జాబు వస్తుందని (Babu Vasthe Job Vastundi) నమ్మబలికి ఓట్లు దండుకున్న చంద్రబాబు, ఇప్పుడు నిరుద్యోగులకు (Unemployed Youth) తీరని అన్యాయం చేశారు. మెగా డీఎస్సీ పేరుతో ‘దగా డీఎస్సీ’ని నిర్వహించారు. నిరుద్యోగులు రోజుకు 20 గంటలు చదువుకుని, రూ.లక్షలు ఖర్చు చేసి కష్టపడితే.. లోకేశ్ ఆ ఉద్యోగాలను హెరిటేజ్‌లో (Heritage Foods) పాలు అమ్ముకున్నట్లు అమ్ముకుంటున్నారు” అని జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
డీఎస్సీ అక్రమాలకు సూత్రధారి మంత్రి నారా లోకేశ్ అని, ఆయనను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించి, A-1గా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐ(CBI) లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో (High Court Sitting Judge) విచారణ జరిపించాలని, నిజానిజాలు బయటపెట్టాలని కోరారు. డీఎస్సీ ఉద్యోగాల భర్తీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ (NTR Trust Bhavan) కేంద్రంగా వేలంపాటలు నిర్వహించారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్లను పాటించలేదని, ఒక్కో పోస్టును 15 నుంచి 20 లక్షల రూపాయలకు అమ్ముకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
“రీల్ హీరోనా? రియల్ హీరోనా?”
నిరుద్యోగుల కన్నీళ్లు పవన్ కళ్యాణ్‌కు (Pawan Kalyan) కనిపించడం లేదా అని జక్కంపూడి రాజా ప్రశ్నించారు. “పవన్ కళ్యాణ్.. మీరు రీల్ హీరోనా లేక రియల్ హీరోనా అనేది తేల్చుకోవాలి. నిజాయితీ ఉంటే వెంటనే డీఎస్సీ అక్రమాలపై స్పందించి, నిరుద్యోగులకు సమాధానం చెప్పాలి” అని సవాల్ విసిరారు. ఎన్నికలకు ముందు జిల్లాకు లక్ష ఉద్యోగాల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, లోకేశ్.. ఇప్పుడు కనీసం ఉన్న ఉద్యోగాలను కూడా అమ్ముకుంటున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. రానున్న రోజుల్లో నిరుద్యోగులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.








