రాష్ట్రంలో భారీ వర్షాల సూచనల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వాతావరణ శాఖ (Meteorological Department) హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని అన్ని జిల్లాల అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా రైతులు (Farmers) ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో (Paddy Procurement Centers) అవసరమైన టార్పాలిన్లు (Tarpaulins) అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇప్పటికే కొనుగోలు పూర్తైన కేంద్రాల నుంచి టార్పాలిన్లను ఇతర కేంద్రాలకు తరలించి ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
ఇక గత రాత్రి నుంచి హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కోతకు వచ్చిన పంటలు తడిసి నష్టపోతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని అనేక జిల్లాలకు వాతావరణ శాఖ ఆరంజ్ అలర్ట్ జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు అవసరం లేకుండా బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేస్తున్నారు.








