ఎండ తీవ్రతతో, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లని కబురు అందించింది. దేశంలోకి నైరుతి రుతుపవనాల ప్రస్థానం అధికారికంగా ప్రారంభమైంది. ముందస్తు అంచనాలకు అనుగుణంగానే పయనిస్తున్న నైరుతి గాలులు(Southwest Winds).. శనివారం (మే 16) నాటికి ఆగ్నేయ అరేబియన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతంలోని (Southwest Bay of Bengal) మెజారిటీ ప్రాంతాలతో పాటు అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి (Andaman & Nicobar Islands) ప్రవేశించాయి.
రుతుపవనాల రాకతో ప్రస్తుతం అండమాన్, నికోబార్ పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు నాలుగు రోజుల్లో ఇవి మరింత పుంజుకుని, బంగాళాఖాతంలోని (Bay of Bengal) మరికొన్ని ప్రాంతాలకు వేగంగా విస్తరించేందుకు పూర్తి అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
మే 26న కేరళకు నైరుతి గాలులు
అండమాన్ సముద్రంలో స్థిరపడిన ఈ రుతుపవనాలు.. ఈ నెల 26వ తేదీన కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. సాధారణంగా జూన్ 1 నాటికి కేరళకు చేరుకోవాల్సిన రుతుపవనాలు, ఈసారి కొద్దిగా ముందే అంటే మే 26 నాటికే (నాలుగు రోజులు అటు ఇటుగా) కేరళను (Kerala) పలకరించనున్నాయి. గత ఏడాది మే 24నే కేరళను తాకిన సంగతి తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల్లోకి ఎప్పుడంటే..?
నైరుతి రుతుపవనాల కదలికలను బట్టి తెలుగు రాష్ట్రాల్లోకి వీటి రాకపై వాతావరణ అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) మే 26న కేరళను తాకిన తర్వాత, అక్కడి నుంచి ముందుకు కదిలి జూన్ మొదటి వారంలోనే.. అంటే జూన్ 5వ తేదీ లోపు నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. అదే విధంగా ఏపీలోకి ప్రవేశించిన అనంతరం ఇవి మరింత ముందుకు సాగి.. జూన్ 12 నాటికి (నాలుగు రోజులు అటు ఇటుగా) తెలంగాణను (Telangana) తాకనున్నాయి.
రుతుపవనాల రాకతో రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు తగ్గి, ఉష్ణోగ్రతలు క్రమంగా క్షీణించనున్నాయి. జూన్ మొదటి వారం నుంచి రెండు రాష్ట్రాల్లోనూ మంచి వర్షాలు కురుస్తాయని, దీంతో ప్రజలకు ఎండల నుండి పెద్ద ఉపశమనం లభిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.









పవన్ కళ్యాణ్ మీకిది తగునా..? విశ్లేషకుల సూటి ప్రశ్నలు