కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ క్రమంలో బాధితురాలి తల్లి విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రెస్ నోట్‌లో ఆమె సంచలన విషయాలను వెల్లడించారు.
2025లో బండి భగీరథ్ తమ కూతురికి పరిచయమయ్యాడని, మొదట స్నేహితుడిలా నటించి ఆ తర్వాత ఆమెను మానసికంగా లోబర్చుకున్నాడని బాధితురాలి తల్లి పేర్కొన్నారు. “మా కూతురిని చదువుకోనివ్వకుండా డిస్టర్బ్ చేశాడు. జనవరి 2026లో వారిద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు అసలు నిజం బయటపడింది. డిసెంబర్ 31న బలవంతంగా మద్యం తాగించి ఒకసారి, మరోసారి అపార్ట్‌మెంట్‌లో తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు మా కూతురు చెప్పి బోరుమంది” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మధ్యవర్తిత్వం చేసిన రిపోర్టర్
న్యాయం కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో జరిగిన పరిణామాలను వివరిస్తూ ఏప్రిల్ 21న బాధితురాలిపైనే రివర్స్ బ్లాక్ మెయిల్ కేసు పెట్టారని తెలిసి తన కుటుంబం దిగ్భ్రాంతికి గురైందని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 22న సంగప్ప అనే వ్యక్తి (రిపోర్టర్) తమ ఇంటికి వచ్చి మధ్యవర్తిత్వం వహించే ప్రయత్నం చేశాడని చెప్పారు. 23న సంగప్ప ద్వారా బండి సంజయ్‌ను కలిసినట్లు ఆమె తెలిపారు. “న్యాయం చేస్తారు అనుకుంటే, మా గురించి దారుణంగా మాట్లాడి, బెదిరించి పంపించేశారు” అని ఆమె ఆరోపించారు.
పోలీస్ స్టేషన్‌లో గంటల తరబడి నిరీక్షణ
న్యాయ పోరాటానికి సిద్ధమై మే 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించి గంటల తరబడి వేచి చూసేలా చేశారని ఆమె పేర్కొన్నారు. ఎన్నో ఒత్తిళ్ల తర్వాత ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారని, బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన తర్వాతే కఠిన సెక్షన్లు చేర్చారని ఆమె వెల్లడించారు.
ఎదురు కేసులు.. కుట్రల ఆరోపణలు
తాము పేట్ బషీరాబాద్ స్టేషన్‌లో ఉన్న సమయంలోనే, కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో భగీరథ్ తమ కూతురిపై కేసు పెట్టాడని తెలిసిందని, ఇది ముందస్తు ప్రణాళికలో భాగమేనని ఆమె ఆరోపించారు. స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్, రిజిస్టర్ టైమింగ్స్ పరిశీలిస్తే ఎవరు ఎప్పుడు కేసు పెట్టారో నిజాలు బయటకు వస్తాయని పోలీసులను కోరారు.
ఐడెంటిటీని గౌరవించండి
చివరగా మీడియా, సోషల్ మీడియా వినియోగదారులకు ఆమె ఒక విన్నపం చేశారు. “దయచేసి నా కూతురి ఫోటోలను, ఆమె గుర్తింపును బయటపెట్టకండి. ఆమె వయస్సు గురించి వస్తున్న వాదనల కంటే, ఆమె అనుభవించిన క్షోభ పెద్దది. ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను” అని ఆమె వేడుకున్నారు.








