ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై నిర్వహించిన మదింపులో కీలక ఫలితాలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో శాఖల వారీగా ర్యాంకులను ప్రకటించారు. ఈ ర్యాంకుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) బాధ్యతలు నిర్వహిస్తున్న అటవీ, పర్యావరణ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ చిట్టచివరి స్థానంలో నిలిచింది.
ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలు, నిర్దేశిత లక్ష్యాల చేరువ వంటి కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ల (Key Performance Indicators) ఆధారంగా ఈ ర్యాంకులను ఖరారు చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. పారదర్శకత కోసం మొత్తం పనితీరును A, B, C, D గ్రేడులుగా వర్గీకరించినట్లుగా సమాచారం.
టాప్‌లో బీసీ సంక్షేమ శాఖ.. లాస్ట్‌లో అటవీ శాఖ
ఈ గ్రేడింగ్స్‌లో సంక్షేమ శాఖలు మెరుగైన ప్రదర్శన కనబరచగా, కొన్ని కీలక శాఖలు వెనుకబడ్డాయి. 100కు 100 పాయింట్లతో బీసీ సంక్షేమ శాఖ అగ్రస్థానంలో నిలిచింది. కేవలం 67 పాయింట్లతో అటవీ, పర్యావరణ శాఖ చివరి ర్యాంకును మూటగట్టుకుంది. దాదాపు 18 ప్రభుత్వ శాఖలు 90 శాతానికి పైగా పాయింట్లు సాధించి ‘A’ గ్రేడ్‌లో నిలిచాయి.
వెనుకబడటానికి కారణాలేంటి?
పవన్ కళ్యాణ్ వారంలో రెండ్రోజులు మాత్రమే ఏపీలో ఉంటూ మిగిలిన ఐదు రోజులు హైదరాబాద్‌లో షూటింగ్‌లలో బిజీగా ఉండడమే కారణమని భావిస్తున్నారు. రోడ్ల శంకుస్థాపనలు, ప్రతిపక్షాన్ని ఆడిపోసుకునే కార్యక్రమాలకు తప్ప శాఖ పరంగా ఎలాంటి సమీక్షలు చేపట్టడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పెండింగ్‌లో ఉన్న పనులు, నిధుల వినియోగం లేదా డేటా అప్‌లోడింగ్‌లో లోపాలు ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కలెక్టర్ల సదస్సులో ఈ ర్యాంకులపై చర్చించిన సీఎం చంద్రబాబు.. తక్కువ పాయింట్లు వచ్చిన శాఖలు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు.
90 శాతం కంటే తక్కువ పాయింట్లు వచ్చిన శాఖల అధికారులు తమ వైఫల్యాలను విశ్లేషించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. పాలనలో వేగం పెంచి, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, వచ్చే సమీక్ష నాటికి గ్రేడింగ్స్ మెరుగుపడాలని స్పష్టం చేశారు. మరోవైపు, పవన్ కళ్యాణ్ శాఖకు తక్కువ ర్యాంక్ రావడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శాఖలో ప్రక్షాళన జరగాల్సి ఉందనే సంకేతాలను ఈ ర్యాంకులు ఇస్తున్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.








