ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు (Debts) ఆల్ టైమ్ రికార్డులను (All-Time Records) సృష్టించాయని ఆర్థిక విశ్లేషకులు లెక్కలు చూపుతుండగా, తాజాగా మంగళవారం మరో భారీ అప్పును సమీకరించింది చంద్రబాబు సర్కార్. ఈ నేపథ్యంలో రాష్ట్ర అప్పుల కుప్పపై రాజకీయ దుమారం రేగుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) మంగళవారం నాడు మరో 4,400 కోట్ల రూపాయల భారీ అప్పు చేసింది. దీంతో చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వ హయాంలో చేసిన మొత్తం అప్పులు 3,62,855 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. కేవలం రెండేళ్ల కాలంలోనే ఇంతటి భారీ స్థాయిలో అప్పులు చేయడం దేశంలోని మరే ఇతర రాష్ట్రంలోనూ జరగలేదని గణంకాలు చెబుతున్నాయి.
అప్పులు ఇలా..
చంద్రబాబు ప్రభుత్వం(Chandrababu Government) వివిధ మార్గాల ద్వారా సేకరించిన రుణాల వివరాలు చూస్తుంటే ఆర్థిక క్రమశిక్షణ తప్పుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బడ్జెటరీ అప్పులు రూ. 2,02,964 కోట్లు, కార్పొరేషన్ల గ్యారెంటీ రుణాలు రూ.1,12,504 కోట్లు, రాజధాని నిర్మాణ అప్పులు (Capital Construction Loans) రూ.47,387 కోట్లు.. ఇవన్నీ కలుపుకొని మొత్తంగా చంద్రబాబు సర్కార్ 23 నెలల కాలంలోనే రూ.3,62,855 కోట్లు చేసిందని గణాంకాలు చెబుతున్నాయి.
రోజువారీ సగటు అప్పు ₹15,766 కోట్లా?
గత రెండేళ్ల పాలనను విశ్లేషిస్తే, ప్రభుత్వం సగటున నెలకు, రోజుకు చేస్తున్న అప్పులు విస్తుగొలుపుతున్నాయి. ఆర్థిక విశ్లేషకుల అంచనా ప్రకారం, ప్రభుత్వం సగటున రోజుకు భారీ మొత్తంలో అప్పు చేస్తూ పాలనను వెళ్లదీస్తోంది. నిన్ననే మార్క్ ఫెడ్ (Markfed) ద్వారా 1800 కోట్ల రూపాయల గ్యారెంటీ రుణానికి ఉత్తర్వులు జారీ చేయడం ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులకు అద్దం పడుతోంది.
రాష్ట్రం దివాళా తీసే దిశగా?
రాష్ట్ర అప్పులు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికల హామీలు, సంక్షేమ పథకాలు, రాజధాని నిర్మాణ వ్యయం కోసం అప్పులు అనివార్యమని ప్రభుత్వం వాదిస్తున్నప్పటికీ, అప్పుల పరిమితి దాటిపోవడం ఆందోళనకరంగా మారింది. సంపాదన మార్గాలను అన్వేషించకుండా కేవలం అప్పులపైనే ఆధారపడటం రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోందని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు.








