ఏపీలో ఇంధన కొర‌త‌.. ‘నో స్టాక్’ బోర్డులతో అవస్థలు! (Videos)

ఏపీలో ఇంధన కొర‌త‌.. 'నో స్టాక్' బోర్డులతో అవస్థలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా వ్యవస్థలో అకస్మాత్తుగా ఏర్పడిన అస్థిరత వాహనదారులను ఆందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా ఆయిల్ కంపెనీల నుంచి సరఫరాలో కోతలు విధిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా డీజిల్ కొరత తీవ్రంగా ఉండటంతో రవాణా రంగంపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అనేక బంకుల్లో డీజిల్ నిల్వలు నిండుకోవడంతో యాజమాన్యాలు బోర్డులు పెట్టేశాయి. వ్యవసాయ పనుల సీజన్ కావడంతో ట్రాక్టర్ల కోసం డీజిల్ దొరకక రైతులు అల్లాడిపోతున్నారు. కొన్ని బంకుల్లో డీజిల్ ఉన్నప్పటికీ, పరిమితంగానే పోస్తున్నారు. “రికమండేషన్” ఉంటేనే డీజిల్ ఇస్తామని, అది కూడా ఫుల్ ట్యాంక్ కాకుండా కేవలం హాఫ్ ట్యాంక్ మాత్రమే పోస్తామని సిబ్బంది తెగేసి చెబుతుండటంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కృత్రిమ కొరతపై అనుమానాలు
డీజిల్ ధరలు త్వరలో పెరగవచ్చనే ఊహాగానాల నేపథ్యంలో, కొన్ని బంకుల యాజమాన్యాలు నిల్వలు ఉన్నప్పటికీ కావాలనే ‘నో స్టాక్’ బోర్డులు పెట్టి కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. లోడ్ వచ్చిన వాహనాలను కూడా ఖాళీ చేయకుండా పక్కన పెడుతున్నారని డీజిల్ కోసం గంటల తరబడి వేచి చూస్తున్న లారీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సరఫరాలో అంతరాయం, డీలర్ల ఫిర్యాదుల నేపథ్యంలో, కానూరులోని సివిల్ సప్లైస్ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. సివిల్ సప్లైస్ అధికారులు, ప్రముఖ ఆయిల్ కంపెనీల (HPCL, BPCL, IOCL) ప్రతినిధులు, ఏపీ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. కంపెనీలు విధిస్తున్న ఆంక్షలు, రేషనింగ్ విధానాన్ని వెంటనే తొలగించాలని డీలర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. సమస్య పరిష్కారంపై కీలక అంశాల‌పై చ‌ర్చించిన‌ట్టుగా స‌మాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment