అనంతలో ‘హనీట్రాప్’.. లేడీ డాన్, టీడీపీ నేత అరెస్ట్‌

అనంతలో ‘హనీట్రాప్’.. లేడీ డాన్, టీడీపీ నేత అరెస్ట్‌

ఏపీలో (Andhra Pradesh) హ‌నీ ట్రాప్ (Honey Trap) బండారం బ‌ట్ట‌బ‌య‌లు అయ్యింది. అనంతపురం జిల్లాలో అమాయకులను లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న ఒక భారీ హనీట్రాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో కీలక నిందితురాలు, ‘లెడీ డాన్’గా (Lady Don) పిలవబడే రంగమ్మ (Rangamma Naidu) నాయుడుతో పాటు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల ప్రమేయం ఉండటం స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది.

కేసు వివరాలు
అనంతపురం రూరల్ డీఎస్పీ టి. శ్రీనివాసులు (T. Srinivasulu) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ముఠా మహిళలను ఎరగా వేసి, బాధితులను ఏకాంత ప్రదేశాలకు పిలిపించి, వారి న్యూడ్ ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసేవారు. వారి నుంచి భారీగా న‌గ‌దు లాక్కుంటారు. ఇప్పటివరకు దాదాపు 20 మందిని బెదిరించి సుమారు రూ. 1 కోటి నుండి 2 కోట్ల వరకు వసూలు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

మొత్తం 9 మంది నిందితులు ఉండగా, ప్రస్తుతం ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరో 10 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి నుంచి 13 లక్షల రూపాయల నగదు, రెండు కత్తులు, ఆరు సెల్ ఫోన్లు, బాధితుల నుంచి బలవంతంగా సంతకాలు చేయించుకున్న ప్రాంసరీ నోట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసు అధికారుల పాత్ర
ఈ హనీట్రాప్ కేసులో రాజకీయ నేతలు, పోలీసుల ప్రమేయం బయటపడటం కలకలం రేపుతోంది. కీలక నిందితురాలు రంగమ్మ నాయుడు బీజేపీ నేత కాగా, ఈ ముఠా కార్యకలాపాలకు వెనుక ఉండి నడిపించిన వ్యక్తి టీడీపీ నేత దబ్బర రాజేష్ నాయుడు (Dabbara Rajesh Naidu) అని తెలుస్తోంది. ముఠాకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాప్తాడు సీఐ శ్రీహర్ష, అనంతపురం త్రీ టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్లను వీఆర్‌కు బదిలీ చేశారు. మరో 8 మంది కానిస్టేబుళ్ల పాత్రపై కూడా ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం, రాజకీయ సిఫార్సులతో పోస్టింగ్‌లు తెచ్చుకుని అసాంఘిక కార్యకలాపాలకు సహకరించడంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుత పరిస్థితి
ముఠా నాయకురాలు రంగమ్మ నాయుడుపై ఇప్పటికే 10 కేసులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం నిందితులను రిమాండ్‌కు తరలించారు. అయితే, నిందితులు అధికార కూటమి నేతలు కావడంతో వారిని మీడియా ముందు ప్రవేశపెట్టలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment