వైఎస్సార్ జిల్లాలో (YSR District) సంచలనం సృష్టించిన వైసీపీ కార్యకర్త పెద్దదస్తగిరి (Peddadastagiri) హత్య కేసు (Murder Case) విచారణలో రాజకీయ మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానందరెడ్డి (Nithyananda Reddy) భార్య, న్యాయవాది బండి దీప్తి పోలీసుల విచారణ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన భర్తను రాజకీయంగా దెబ్బతీయడానికి కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆమె ఆరోపించారు.
కడపలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల తీరుపై, టీడీపీ (TDP) అనుకూల మీడియా ప్రచారంపై నిప్పులు చెరిగారు. కేసు విచారణ అధికారి నియామకంపై అనుమానాలు వ్యక్తం చేసిన దీప్తి. కేసును పక్కదోవ పట్టించేందుకే తమతో పాత విభేదాలు ఉన్న పోలీసు అధికారిని విచారణ అధికారిగా నియమించారని దీప్తి (Deepthi) ఆరోపించారు.
“గతంలో వైఎస్సార్ (YSR) నేమ్ బోర్డు విషయంలో మాతో గొడవపడి, మహిళనని కూడా చూడకుండా నోటికొచ్చినట్లు మాట్లాడిన అధికారికి ఈ కేసు విచారణ బాధ్యతలు అప్పగించారు. ఇటీవల ఆంధ్రజ్యోతి వద్ద ధర్నా చేసిన సమయంలోనూ సదరు డీఎస్పీ ప్రవర్తనను అందరూ చూశారు. అలాంటి వ్యక్తి నుంచి పారదర్శకమైన విచారణ ఎలా ఆశించగలం?” అని ఆమె ప్రశ్నించారు.
రాజకీయ కుట్ర.. అక్రమ కేసులు
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నిత్యానందరెడ్డిని అడ్డు తొలగించుకోవడానికే ఈ కేసులో ఇరికిస్తున్నారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. “నా భర్తపై ఉన్నవన్నీ సివిల్ కేసులు లేదా పార్టీ తరపున ఉద్యమాలు చేసినప్పుడు పెట్టినవి. సమైక్యాంధ్ర ఉద్యమంలో పెట్టిన కేసులను క్రిమినల్ రికార్డుగా చూపిస్తూ పచ్చ మీడియా విషప్రచారం చేస్తోంది. వంద కోట్ల ఆస్తి కోసం హత్య చేశారని చెబుతున్నారు, కానీ దానికి సంబంధించి ఒక్క చిన్న ఆధారం కూడా చూపడం లేదు. నిన్న రాత్రి సెర్చ్ వారెంట్‌తో వచ్చి నా వ్యక్తిగత న్యాయవాద పత్రాలను కూడా తీసుకెళ్లారు.”
పీఏపై దాడి.. బలవంతపు వాంగ్మూలం
పోలీసులు తమ ఇంట్లో పనిచేసే పర్సనల్ అసిస్టెంట్‌ను తీసుకెళ్లి విపరీతంగా కొట్టారని దీప్తి ఆరోపించారు. “కేసులో నిత్యానందరెడ్డి పాత్ర ఉందని ఒప్పుకోవాలని అతన్ని బెదిరించారు. రాజకీయ నాయకులతో దిగిన ఫోటోలను ఆధారాలుగా చూపడం ఎంతవరకు సమంజసం?” అని ఆమె నిలదీశారు. చనిపోయిన పెద్దదస్తగిరితో తమకు మంచి అనుబంధం ఉందని, అతనికి రక్షణ కావాలని కోరినా పోలీసులు పట్టించుకోలేదని ఆమె విమర్శించారు. నిజానిజాలు నిర్ధారించకుండా కేవలం రాజకీయ కక్షతోనే తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని, దీనిపై చట్టప్రకారం పోరాడతామని ఆమె స్పష్టం చేశారు.








