తెలుగుదేశం పార్టీలో (Telugu Desam Part) విభేదాలు ముదిరి వివాదాలు మారి బహిర్గతమయ్యాయి. పార్టీ నేతల చేష్టలకు విసుగు చెంది సొంత పార్టీ ఎమ్మెల్యే(MLA) ఏకంగా రాజీనామాకు (Resignation) సిద్ధపడే వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గ (Satyavedu Constituency) ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం (Koneti Adimulam) కుమారుడు, జడ్పీటీసీ కోనేటి సుమన్ (Koneti Suman) సొంత పార్టీ నాయకత్వంపైనే తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)లను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఖర్చు చేసిన డబ్బులు ఇస్తే చాలు..
ఎన్నికల ఖర్చు విషయంలో సుమన్ ఘాటుగా స్పందించారు. “మేము ఎన్నికల్లో కష్టపడి, కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఈ సీటు గెలిచాం. మాకు గౌరవం లేని ఈ పదవి అవసరం లేదు. ఎన్నికల్లో మేము పెట్టిన ఖర్చును వెనక్కి ఇచ్చేస్తే, నాన్నగారు (కోనేటి ఆదిమూలం) వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు” అని సొంత పార్టీకి సంచలన ఆఫర్ ప్రకటించారు.

పార్టీలో దళితులకు జరుగుతున్న అన్యాయంపై ఎమ్మెల్యే కుమారుడు సుమన్ విరుచుకుపడ్డారు. “రాష్ట్రంలో దళితులకు ఒక న్యాయం, అగ్రవర్ణాలకు ఒక న్యాయమా? ఒక ఎస్సీ నియోజకవర్గంలో అగ్రవర్ణ వ్యక్తిని ఇన్‌చార్జిగా ఎలా నియమిస్తారు? సత్యవేడులో కోఆర్డినేటర్ పదవికి ఒక్క దళితుడు కూడా మీకు కనిపించలేదా?” అంటూ చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.
అంబేద్కర్ (Dr. B.R. Ambedkar) రచించిన రాజ్యాంగం సత్యవేడులో అమలు కావడం లేదని, దళిత నేతలను వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ పర్యటనలో కనీసం అంబేద్కర్ ఫోటో కూడా లేకపోవడాన్ని ఆయన ఎత్తిచూపారు.

నియోజకవర్గంలో పోలీసుల సమక్షంలోనే అక్రమాలు జరుగుతున్నాయని సుమన్ ఆరోపించారు. ప్రతిరోజూ పదుల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లలో గ్రావెల్, ఇసుక అక్రమంగా తమిళనాడుకు తరలిపోతున్నాయని ఆరోపించారు. దీనిపై కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, స్థానిక సీఐ రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
గౌరవం లేని చోట ఉండలేం
పార్టీ కోసం కష్టపడిన తమకు కనీస గౌరవం దక్కడం లేదని, అక్రమాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదని సుమన్ విమర్శించారు. “గౌరవం లేనప్పుడు ఈ పార్టీలో, ఈ పదవిలో ఉండటం వృథా” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సత్యవేడు టీడీపీలో ముసలం పుట్టించాయి. ఈ వ్యవహారంపై టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.








