ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని (Capital) అంశం హాట్ టాపిక్‌గా మారింది. అమరావతిలో (Amaravati) రూ.2 లక్షల కోట్ల పెట్టుబడి దండగ.. మావిగన్(MAVIGUN) ఉండగా అనే చర్చ విస్తృతంగా జరుగుతున్న వేళ.. కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ (Chinta Mohan) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారి తీశాయి. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, అమరావతిని రాజధానిగా రాయలసీమ (Rayalaseema), ఉత్తరాంధ్ర (North Andhra) ప్రజలు అంగీకరించడం లేదని వ్యాఖ్యానించారు.
తిరుపతిని రాజధానిగా చేయాలన్న డిమాండ్
రాష్ట్ర ప్రజలు అమరావతిని లోలోపల చంద్రావతి (Chandravathi) అని పిలుస్తున్నారని చింతా మోహన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు తిరుపతిని (Tirupati) రాజధానిగా చేస్తే అన్ని ప్రాంతాల ప్రజలు అంగీకరిస్తారని అభిప్రాయపడ్డారు. రాజధాని నిర్మాణానికి పెద్ద ఎత్తున భూములు అవసరం లేదని, వెయ్యి ఎకరాలు చాలు అని తెలిపారు. ఈ రోజుల్లో పరిపాలన ఎక్కువగా డిజిటల్ విధానాల్లో జరుగుతున్న నేపథ్యంలో లక్ష ఎకరాల భూమితో రాజధాని నిర్మాణం అవసరమా అని ప్రశ్నించారు. భారీ ప్రాజెక్టులు రాష్ట్రానికి అప్పులు, నష్టాలే తెస్తాయని విమర్శించారు.
సహజ వనరుల వినియోగంపై కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం సహజ వనరులను దోపిడి చేస్తోందని, విలువైన ఖనిజాలు అక్రమంగా తరలిపోతున్నాయని అన్నారు. సత్యవేడులో ఇసుక దోపిడి పెద్ద ఎత్తున జరుగుతోందని, ఇతర రాష్ట్రాలకు ఖనిజాలు తరలిస్తున్నారని ఆరోపించారు.
డీలిమిటేషన్‌పై ఆందోళన
డీలిమిటేషన్ (Delimitation) అంశంపైనా చింతా మోహన్ స్పందించారు. ఈ ప్రక్రియ వల్ల ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల మధ్య అసమానతలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర భారతానికి ఎక్కువ సీట్లు, దక్షిణ భారతానికి తక్కువ సీట్లు వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఇది దేశంలో ప్రాంతీయ అసమతుల్యతకు దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మహిళా రిజర్వేషన్ వరకే పరిమితం చేయాలని, డీలిమిటేషన్ పెంపుపై తొందరపడవద్దని కేంద్రానికి సూచించారు. ఈ అంశం సున్నితమైనదని, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని చింతా మోహన్ తెలిపారు.








