ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి (TDP-JSP-BJP) నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ప్రజలకు మేలు చేయలేనప్పుడు ఈ పదవి ఎందుకని ప్రశ్నిస్తూ, అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.
ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం
తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆదినారాయణరెడ్డి, కూటమి ప్రభుత్వ పనితీరుపై నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదని ఆయన ఆరోపించారు. గండికోట నిర్వాసితులకు పరిహారం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఇతర శాఖల్లోనూ ఫైళ్లు ముందుకు కదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.”నేను ఇప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, నాకు పదవులు ముఖ్యం కాదు. ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఈ పదవిలో కొనసాగడం అనవసరం” అని స్పష్టం చేశారు.
రాజీనామా అస్త్రం.. ‘కమ్మని’ పాలనపై చర్చ
గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సమక్షంలోనే రాష్ట్రంలో “కమ్మని పాలన” సాగుతోందని వ్యాఖ్యానించి టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం కలిగించిన ఆదినారాయణరెడ్డి, ఇప్పుడు నేరుగా రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు. కూటమిలో తనను ఇబ్బంది పెడుతున్నారని, అందుకే పార్టీలోనే ఉంటూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కూటమిలో చర్చనీయాంశంగా ఎమ్మెల్యే వ్యాఖ్యలు
ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వంలోని అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కీలకమైన ప్రాజెక్టుల నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్న ఆరోపణలకు ఈ వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ పరిణామాలపై కూటమి అగ్రనాయకత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.








