సాధారణంగా నిందితులకు వేయాల్సిన బేడీలను.. రైల్వే కోడూరు (Railway Koduru) పోలీసులు (Police) ఏకంగా స్టేషన్ గేటుకు వేసి లాక్ చేసిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక మహిళపై నడిరోడ్డుపై దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న జనసేన (Jana Sena Party) నేతను మీడియా కంట పడకుండా కాపాడేందుకు పోలీసులు చేసిన ఈ ప్రయత్నం విమర్శలకు దారితీస్తోంది.
అసలు ఏం జరిగింది?
రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (Arava Sridhar) అనుచరుడు, జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర (Tatamshetty Nagendra), హర్షవీణ (Harshaveena) అనే మహిళపై నడిరోడ్డుపై అత్యంత పాశవికంగా, విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు జనసేన నేత తాతంశెట్టి నాగేంద్రపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే, విచారణ పేరుతో స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు అనుసరించిన తీరు అత్యంత వివాదాస్పదంగా మారింది.
పోలీసుల హై డ్రామా.. గేటుకు బేడీలు
ప్రజల కోసం నిత్యం తెరిచి ఉండాల్సిన పోలీస్ స్టేషన్ గేట్లకు బేడీలు వేసి, లోపల ఏం జరుగుతుందో తెలియకుండా అత్యంత గోప్యత పాటించారు. సాధారణంగా నిందితులను బహిరంగంగా తీసుకువెళ్లే పోలీసులు.. ఈ జనసేన నేత విషయంలో మాత్రం మీడియాకు చిక్కకుండా పడరాని పాట్లు పడ్డారు. నడిరోడ్డుపై తనను చితకబాదిన వ్యక్తికి పోలీసులు ఇలా కొమ్ముకాయడంపై బాధితురాలు హర్షవీణ, దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
సాధారణ నేరస్తులను రోడ్డుపై నడిపించే పోలీసులు, అధికార పార్టీ నేత విషయంలో ఇంతటి ‘అతి’ వినయం ప్రదర్శించడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటి? చట్టం అందరికీ సమానమే అని చెప్పే ఖాకీలు.. ఇక్కడ మాత్రం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గినట్లు స్పష్టమవుతోంది. నిందితుడిని కాపాడేందుకు స్టేషన్ గేటుకే బేడీలు వేయడం పోలీసు శాఖ చరిత్రలోనే ఒక వింతగా మిగిలిపోనుంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.








