తెలుగుదేశం (Telugu Desam Party, జనసేన (Jana Sena Party) నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు శ్రీకాళహస్తి పట్టణంలో తయారయ్యాయి. పానగల్ ఉరంధూరు ఆర్చ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న జనసేన కార్యకర్త శివకుమార్ (Shivakumar) ఇంటిని పోలీసుల సహాయంతో మున్సిపల్ అధికారులు (Municipal Officials) అర్ధరాత్రి కరెంట్ కట్ చేసి, జెసిబితో (JCB Machine) కూల్చివేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
అసలేం జరిగింది?
బాధితుడు శివకుమార్ తన సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, రాజకీయ కక్షతోనే అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. గత మార్చి 28నే మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ తనను బెదిరించారని శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా, బలవంతంగా విద్యుత్ సరఫరా నిలిపివేసి, ఇంట్లో వారు ఉండగానే తాళం వేసి మరీ అధికారులు కూల్చివేతకు పాల్పడటం గమనార్హం.
డ్రైవర్ రాయుడి హత్య కేసు – పొలిటికల్ లింక్?
ఈ కూల్చివేత వెనుక పాత కక్షలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. గతేడాది జూలైలో జరిగిన వినుత కోట డ్రైవర్ రాయుడి హత్య కేసులో శివకుమార్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో వినుత దంపతులతో పాటు శివకుమార్ కూడా జైలుకు వెళ్లి వచ్చారు. శివకుమార్‌ను తన దారికి తెచ్చుకోవాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి (Sudheer Reddy) ప్రయత్నించారని, అతను లొంగకపోవడంతోనే ఈ కూల్చివేతకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఎమ్మెల్యేకి వినుత కోట వార్నింగ్
ఈ ఘటనపై జనసేన నేత వినుత కోట ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై (Sudheer Reddy) నిప్పులు చెరిగారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. “జనసైనికులను టెర్రరిస్టుల మాదిరిగా ట్రీట్ చేస్తారా? సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే మీ అభ్యంతరం ఏంటి? ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. నువ్వు ఎవడబ్బ సొమ్మని మా కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తున్నావ్?” గత ఐదేళ్లు గోవా, ముంబై పబ్బుల్లో గడిపిన సుధీర్ రెడ్డి, చివర్లో గద్దలా వచ్చి ఎమ్మెల్యే పదవిని దక్కించుకున్నారని ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ముఖం చూసి తామంతా ఓపిక పడుతున్నామని, కానీ జనసైనికులపై పడితే తిరగబడతామని హెచ్చరించారు. శ్రీకాళహస్తిలో జనసేనను తొక్కేయాలని ఎమ్మెల్యే పక్కా ప్లాన్ తో వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ప్రస్తుతం ఈ కూల్చివేత వ్యవహారం శ్రీకాళహస్తిలో కూటమి నేతల మధ్య ఉన్న అంతర్గత పోరును బహిర్గతం చేసింది. ఒకవైపు పొత్తు ధర్మం అంటూ పెద్దలు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం టీడీపీ-జనసేన నేతల మధ్య యుద్ధం తారస్థాయికి చేరింది.








