ఎన్నికల నగారా.. తమిళనాడు సహా ఐదు రాష్ట్రాల షెడ్యూల్ విడుదల

తమిళనాడు సహా ఐదు ప్రాంతాలకు ఎన్నికల తేదీలు ప్రకటించిన ఈసీ

దేశంలో మరోసారి ఎన్నికల సందడి ప్రారంభమైంది. తమిళనాడు (Tamil Nadu), కేరళ (Kerala), పశ్చిమ బెంగాల్ (West Bengal), అస్సాం (Assam) రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి (Puducherry) అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను (Assembly Elections Schedule) ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) ప్రకటించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) ఎన్నికల తేదీలను వెల్లడించగా, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు వివిధ రాజకీయ పార్టీల నేతలు, చీఫ్ ఎలక్టోరల్ అధికారులు, డీజీపీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు మరియు నోడల్ అధికారులతో సమావేశాలు నిర్వహించినట్లు సీఈసీ తెలిపారు.

ఈ ఐదు ప్రాంతాల్లో కలిపి మొత్తం 17.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరినీ ఓటర్ల జాబితాలో చేర్చడం, అక్రమ ఓటర్లను తొలగించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఓటర్ల అవగాహన పెంచేందుకు అధికారులు యువ ఓటర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ఈ ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా 2.19 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, దాదాపు 25 లక్షల మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. ఇందులో 15 లక్షల మంది పోలింగ్ సిబ్బంది, 8.5 లక్షల మంది భద్రతా సిబ్బంది ఉంటారు. ఓటర్ల సంఖ్యలో పశ్చిమ బెంగాల్ 6.44 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా, తమిళనాడు 5.67 కోట్లతో రెండో స్థానంలో ఉంది. కేరళలో 2.7 కోట్లు, అస్సాంలో 2.25 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. పుదుచ్చేరిలో 9.44 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. దేశంలో ‘‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’’ (One Nation–One Election)పై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను తక్కువ విడతల్లో నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

Join WhatsApp

Join Now

Leave a Comment