కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గుడ్‌బై? ఉగాది లోపే ‘కారు’ ఎక్కేందుకు సిద్ధం!

కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గుడ్‌బై? ఉగాది లోపే 'కారు' ఎక్కేందుకు సిద్ధం!

తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) పెను సంచలనం రేపే పరిణామం చోటుచేసుకోబోతోంది. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి (T. Jeevan Reddy) ఆ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న ఆయన, ఈ నెల మార్చి 20 లోపు తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

అసంతృప్తికి ప్రధాన కారణం ఇదే..
జగిత్యాల నియోజకవర్గంలో (Jagtial Constituency) తన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను (Dr. Sanjay Kumar) కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడం, ఆయనకు ప్రాధాన్యతనివ్వడాన్ని జీవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ కోసం దశాబ్దాలుగా పని చేస్తున్న తనను కాదని, ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. “ఒక కాంగ్రెస్ కార్యకర్తనై ఉండి, ఈ అవమానాన్ని భరించలేను” అంటూ తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో సంకేతాలు..
జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై వస్తున్న వార్తలకు బలం చేకూరుస్తూ, ఆయన ప్రధాన అనుచరులు, అభిమానులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్, వాట్సాప్ డీపీలను (DPs) మార్చేశారు. పాత డీపీలను తీసివేసి కొత్తవి పెట్టుకోవడం జగిత్యాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే జీవన్ రెడ్డి తన ముఖ్య కార్యకర్తలతో వరుస భేటీలు నిర్వహిస్తూ భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు.

ఉగాది నాటికి ‘కారు’ గుర్తుతో కొత్త ప్రయాణం?
వచ్చే ఉగాది పండుగ లోపే జీవన్ రెడ్డి కొత్త నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. జగిత్యాలలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి, తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ (BRS) తీర్థం పుచ్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని వర్గాల సమాచారం ప్రకారం, మార్చి 25న ఆయన రాజీనామా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

సీనియర్ నేతగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పట్టున్న నాయకుడిగా పేరున్న జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడితే, అది ఉత్తర తెలంగాణలో హస్తం పార్టీకి పెద్ద దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామంపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Join WhatsApp

Join Now

Leave a Comment