ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కూటమి ప్రభుత్వం (Alliance Government) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కలెక్టర్లు, ఎస్పీల సదస్సు (Collectors and SPs Conference) రెండో రోజు ముగింపు దశకు చేరుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సహా దాదాపు మంత్రులందరూ హాజరై జిల్లాల వారీగా ప్రగతిని సమీక్షిస్తుంటే.. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఇద్దరు వ్యక్తులు గైర్హాజరు కావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఈ కీలక భేటీకి డుమ్మా కొట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పవన్ కళ్యాణ్ షూటింగుల్లో బిజీనా?
డిప్యూటీ సీఎంగా పంచాయతీ రాజ్, అటవీ శాఖల వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్.. జిల్లాల కలెక్టర్లతో జరిగే ఈ సమీక్షా సమావేశానికి హాజరు కాకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. కనీసం ఆయన రాష్ట్రంలో కూడా లేడని విమర్శలు రావడం గమనార్హం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో తన తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) చిత్ర షూటింగ్, ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది.
పవన్ కళ్యాణ్ గతంలోనూ కేబినెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ప్రజా సమస్యలు చర్చించే వేదికల కంటే సినిమాలకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారా? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. పరిపాలనపై ఆయనకు ఉండాల్సిన చిత్తశుద్ధి ఇదేనా అని నెటిజన్లు నిలదీస్తున్నారు.
క్రికెట్ ఉన్నంత శ్రద్ధ కలెక్టర్ల సదస్సుపై లేదా?
ప్రభుత్వంలో నంబర్-2 గా, సర్వమూ తానే అయి నడిపిస్తున్నానని తన అనుచరులు, సన్నిహితులతో చెప్పించుకునే మంత్రి నారా లోకేష్ కూడా ఈ రెండు రోజుల సదస్సుకు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. ఎక్కడ క్రికెట్ మ్యాచ్ జరిగినా ప్రత్యేక విమానాలు వేసుకుని వెళ్లి ఫోటోలకు ఫోజులిచ్చే లోకేష్.. కీలకమైన కలెక్టర్ల సదస్సుకు ఆ మాత్రం సమయం కేటాయించలేరా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. పరిపాలనలో చురుగ్గా ఉంటున్నానని పార్టీ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయించుకునే లోకేష్.. విధానపరమైన నిర్ణయాలు తీసుకునే ఇలాంటి కీలక భేటీలకు ఎందుకు రావడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
విశ్లేషకుల అభిప్రాయం
భవిష్యత్తులో రాజకీయంగా రాణించాలనుకునే నాయకులు ప్రజా సమస్యలపై అంకితభావంతో పనిచేయాలని, కానీ ఇలా కీలక సమయాల్లో పొరుగు రాష్ట్రాల్లో సేదతీరడం లేదా వినోదాలకు ప్రాధాన్యత ఇవ్వడం సరైన పద్ధతి కాదని విశ్లేషకులు సూచిస్తున్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో ముఖాముఖి చర్చించి సమస్యలు తెలుసుకోవాల్సిన బాధ్యతను విస్మరించి, వ్యక్తిగత పనులకు ప్రాధాన్యత ఇవ్వడం కూటమి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.








