‘చంద్రబాబు ఆర్థిక విధ్వంసం.. రెండేళ్లు నిండ‌కుండానే రూ.3.20 లక్షల కోట్ల అప్పు’

'చంద్రబాబు ఆర్థిక విధ్వంసం.. రెండేళ్లు నిండ‌కుండానే రూ.3.20 లక్షల కోట్ల అప్పు'

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YSRCP Chief YS Jagan Mohan Reddy) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో (Press Meet) ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం (Alliance Government) అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆదాయం తగ్గి అప్పులు అమాంతం పెరిగాయని విమర్శించారు. చంద్రబాబు హయాంలో జరుగుతున్నది “ఆర్థిక విధ్వంసం” అని ఆయన అభివర్ణించారు.

కాగ్ నివేదిక సాక్షిగా.. తప్పుడు లెక్కలు!
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చూపిస్తున్న లెక్కలకు, కాగ్ (CAG) నివేదికకు పొంతన లేదని జగన్ ఆరోపించారు. 2024-25లో బడ్జెట్ అప్పులు రూ. 60,485 కోట్లు అని ప్రభుత్వం చెబితే, కాగ్ నివేదిక (CAG Report) మాత్రం అది రూ. 81,071 కోట్లుగా తేల్చిందని ఆయన ఆధారాలు చూపించారు. అంటే సుమారు రూ. 20 వేల కోట్ల అప్పులను ప్రభుత్వం దాచిపెట్టిందని మండిపడ్డారు. బ‌డ్జెట్(Budget) వెలుపల చేసిన అప్పుల వివరాలు అడిగితే ప్రభుత్వం సమాధానం దాటవేస్తోందని, సభను తప్పుదోవ పట్టించిన అధికారులపై డీవోపీటీ (DoPT)కి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

రెండేళ్లలోనే రూ. 3.2 లక్షల కోట్ల అప్పు
చంద్రబాబు (Chandrababu) అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రాబడులు తగ్గి, ఖర్చులు పెరిగాయని జగన్ గణాంకాలతో వివరించారు. 2024-25, 2025-26 రెండేళ్ల కాలంలో చంద్రబాబు తెచ్చిన మొత్తం అప్పులు రూ. 3.2 లక్షల కోట్లు అని ఆయన తెలిపారు. “మా ఐదేళ్ల హయాంలో చేసిన అప్పులు రూ. 3.31 లక్షల కోట్లు అయితే, అందులో 96% అప్పులను చంద్రబాబు కేవలం ఈ రెండేళ్లలోనే చేసేశారు” అని ఎద్దేవా చేశారు. రెవెన్యూ లోటు 56 శాతం, ద్రవ్య లోటు 30 శాతం మేర పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

దోపిడీ వల్లే ఆదాయానికి గండి
రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రాకపోవడానికి విచ్చలవిడి అవినీతే కారణమని జగన్ దుయ్యబట్టారు. “మట్టి, ఇసుక, భూములు, లిక్కర్.. దేన్నీ వదలడం లేదు. విశాఖలో రూ. 5 వేల కోట్ల విలువైన 54 ఎకరాల ప్రభుత్వ భూములను ముఖ్యమంత్రి బంధువు కబ్జా చేస్తున్నారు. ఇలా దోపిడీ జరుగుతుంటే ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుంది? ప్రజలకు సంక్షేమం ఎలా అందుతుంది?” అని ప్రశ్నించారు.

ఖజానా ఖాళీ.. నగదు నిల్వలు నిల్‌!
రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో కనీస నగదు నిల్వలు (Minimum Balance) ఉండే రోజులు పడిపోయాయని జగన్ విమర్శించారు. 2024-25లో ఏడాదిలో కేవలం 8 రోజులు మాత్రమే నగదు నిల్వలు ఉన్నాయని, మిగిలిన 357 రోజులు ఆర్బీఐ అడ్వాన్స్‌ల మీదనే ఆధారపడాల్సి వచ్చిందని వివరించారు.

జాకీల ప్రభుత్వం.. ప్రజలకు సున్నా
16 రోజుల అసెంబ్లీ సమావేశాల వల్ల ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని జగన్ విమర్శించారు. “చంద్రబాబు తన కొడుకును జాకీలు పెట్టి ఎత్తితే, లోకేష్ తన తండ్రిని ఎత్తుతాడు.. వీరిద్దరినీ పవన్ కళ్యాణ్ మరో జాకీ పెట్టి లేపుతాడు. ఈ సెల్ఫ్ డబ్బాలు, తప్పుడు ప్రచారాల మధ్య సామాన్యుడి ప్రయోజనాలు గాలికి కొట్టుకుపోతున్నాయి” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment