నెయ్యి కొనుగోలులో రూ. 200 కోట్ల కుంభకోణం? ‘హెరిటేజ్’ లింకులే టార్గెట్!

నెయ్యి కొనుగోలులో రూ. 200 కోట్ల కుంభకోణం? 'హెరిటేజ్' లింకులే టార్గెట్!

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల లడ్డూ ప్రసాదం (Tirumala Laddu Prasadam) తయారీకి ఉపయోగించే నెయ్యి (Ghee) కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగినట్లు సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. గత 12 నుండి 15 నెలల కాలంలోనే సుమారు రూ. 200 కోట్ల మేర తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర‌స్వామి (Lord Venkateswara) వారి సొమ్ము (Temple Funds) గోల్‌మాల్ అయిందని, ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని విశ్లేషణలు పేర్కొంటున్నాయి.

‘యానిమల్ ఫ్యాట్’ వివాదం వెనుక అసలు కథ?
సెప్టెంబర్ 2024లో తెరపైకి వచ్చిన ‘లడ్డూలో జంతువుల కొవ్వు’ (Animal Fat in Laddu) వివాదం కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాకుండా, నెయ్యి రేట్లను అడ్డగోలుగా పెంచి తమకు అనుకూలమైన కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేసే సంస్థలను తప్పించి, అధిక ధరకు ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకే ఈ డ్రామా ఆడారని తెలుస్తోంది.

రేట్ల పెంపు.. రూ.351 నుండి రూ.716కు
గత వైసీపీ ప్రభుత్వ (YSR Congress Party Government) హయాంలో కిలో నెయ్యి ధర రూ. 351 (ఆగస్టు 2024) ఉండగా, ప్రస్తుతం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వంలో (Nara Chandrababu Naidu Government) అది అమాంతం రూ. 716.92 (అక్టోబర్ 2025)కి చేరింది.కేవలం ఏడాది కాలంలోనే నెయ్యి ధరను 105% మేర పెంచడం గమనార్హం. మార్కెట్‌లో నాణ్యమైన ఆవు నెయ్యి ఉత్పత్తి వ్యయం గరిష్టంగా రూ. 400 మాత్రమే ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి.పెంచిన ఈ ధరల వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)పై సుమారు రూ. 200 కోట్ల అదనపు భారం పడింది.

ఇందాపూర్ డెయిరీ – హెరిటేజ్ కనెక్షన్
టీటీడీ బోర్డు ఛైర్మన్ బి.ఆర్. నాయుడు (B.R. Naidu) నేతృత్వంలో టెండర్ల ప్రక్రియలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ వ్య‌వ‌హారంలో ప్రధానంగా మహారాష్ట్రకు చెందిన ఇందాపూర్ డెయిరీ (Indapur Dairy) పేరు వినిపిస్తోంది. తొలుత కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF)కు ఇచ్చిన ఆర్డర్‌ను సగానికి కోత విధించి, 10 లక్షల కిలోల నెయ్యి ఆర్డర్‌ను ఇందాపూర్ డెయిరీకి కట్టబెట్టారు. ఇందాపూర్ డెయిరీ అనేది చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ (Heritage Foods) కోసం ఉత్పత్తులను తయారు చేసే యూనిట్ అని ఇటీవ‌ల వైసీపీ ఆధారాల‌ను బ‌య‌ట‌పెట్టింది.

ఫిబ్రవరి 10, 2026న హెరిటేజ్ వెబ్‌సైట్‌లో ఇందాపూర్‌ను మాన్యుఫ్యాక్చ‌రింగ్ పేర్కొన్నారు. ఈ విషయం బయటకు రావ‌డం, వివాదం ముద‌ర‌డంతో ఫిబ్రవరి 15న దానిని ‘కో-మాన్యుఫ్యాక్చరింగ్ లొకేషన్’గా మార్చారు. ఇదే సమయంలో, ఫిబ్రవరి 14న హెరిటేజ్ వైస్ ప్రెసిడెంట్ మార్కండ్ శాస్త్రి తన పదవికి రాజీనామా చేయడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

గతంలో అనర్హత వేటు.. ఇప్పుడు రెడ్ కార్పెట్
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇదే ఇందాపూర్ డెయిరీ 2016లో నాణ్యత పరీక్షల్లో విఫలమైన కార‌ణంగా టీటీడీ ద్వారా అనర్హత వేటుకు గురైంది. గతంలో రూ. 278 నుండి రూ. 320 కేజీ నెయ్యి అమ్మిన ఇదే సంస్థ, ఇప్పుడు రూ. 658కి టీటీడీకి విక్రయిస్తోంది. మార్కెట్‌లో ప్రస్తుతం ఇందాపూర్ నెయ్యి ధర రూ. 541 నుండి రూ. 580 మధ్యలో ఉండగా, టీటీడీ మాత్రం రూ. 658 నుంచి రూ.716 పెట్టి కొనడం భక్తుల సొమ్మును లూటీ చేయడమేనని ఆరోపణలు వస్తున్నాయి. ఓపెన్ మార్కెట్‌లో ఇదే ఇందాపూర్ నెయ్యి త‌క్కువ ధ‌ర‌కు వ‌స్తుంటే.. అధిక ధ‌ర‌ల‌కు కొనడం వెనుక మర్మమేంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

విచారణకు డిమాండ్
గతంలో (2016లో) నాణ్యత పరీక్షల్లో విఫలమై అనర్హత వేటు పడిన ఇందాపూర్ డెయిరీకి మళ్ళీ ఆర్డర్లు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రూ. 200 కోట్ల కుంభకోణంపై సిబిఐ (CBI) విచారణ జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. శ్రీవారి ప్రసాదం విషయంలో జరిగిన ఈ రేట్ల అంకెల గారడీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ, కాంట్రాక్టుల పేరుతో దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలకు చంద్ర‌బాబు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment