మిడిల్ ఈస్ట్‌లో (Middle East) యుద్ధ మేఘాలు మరింత గడ్డకట్టుతున్నాయి. అమెరికా (United States)–ఇరాన్ (Iran)–ఇజ్రాయెల్ (Israel) మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో గల్ఫ్ ప్రాంతం (Gulf Region) మొత్తం ఆందోళనలో మునిగిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఖతార్, దుబాయ్, కువైట్, అబుదాబి వంటి దేశాల్లో నివసిస్తున్న సుమారు కోటి మందికి పైగా ప్రవాస భారతీయులు భయాందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న అనిశ్చితి పరిస్థితులు నెలకొనడంతో వేలాది మంది ప్రయాణికులు గల్ఫ్ దేశాల్లోనే చిక్కుకుపోయారు. విమాన రాకపోకలు నిలిచిపోవడం, భద్రతా హెచ్చరికలు జారీ కావడం వల్ల పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
ప్రపంచ పెద్దన్నగా వ్యవహరిస్తున్న అమెరికా, ఆయిల్ నిల్వలు అధికంగా ఉన్న దేశాలపై వ్యూహాత్మక ఒత్తిడి తీసుకువస్తుందనే విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. తాజాగా అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం మరింత ముదిరింది. ఇరాన్ సుప్రీం లీడర్ హత్య అనంతరం ఇరాన్ దళాలు ప్రతీకార దాడులకు దిగినట్లు వార్తలు వెలువడ్డాయి. అరబ్ దేశాల్లో ఉన్న అమెరికా వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినా, పటిష్టమైన డ్రోన్ రక్షణ వ్యవస్థల కారణంగా పెద్ద నష్టం జరగలేదని సమాచారం.
అయితే పరిస్థితిని మరింత ఉధృతం చేసిన ఘటనగా, ఇరాన్ అమెరికాకు చెందిన అత్యాధునిక MQ-9 రీపర్ నిఘా డ్రోన్‌ను (MQ-9 Reaper Surveillance Drone) కూల్చివేసినట్లు ప్రకటించింది. సుమారు 30 మిలియన్ డాలర్ల విలువైన ఈ డ్రోన్‌ను క్షిపణితో ధ్వంసం చేసిన వీడియోను కూడా విడుదల చేసినట్లు పేర్కొంది. అత్యంత ఎత్తులో ప్రయాణిస్తూ నిఘా సమాచారాన్ని సేకరించే ఈ డ్రోన్ కూల్చివేతను ఇరాన్(Iran)తన సైనిక సామర్థ్యానికి నిదర్శనంగా చూపిస్తోంది. అమెరికా రక్షణ శాఖ మాత్రం ఈ ఘటనపై ప్రత్యక్షంగా స్పందించకపోయినా, తమ డ్రోన్‌తో సంబంధాలు తెగిపోయినట్లు వెల్లడించింది.
ఈ పరిణామం యుద్ధాన్ని మరింత ప్రమాదకర దిశగా నెట్టే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా ప్రతీకార చర్యలకు దిగితే ఇరాన్ రాడార్ వ్యవస్థలు, క్షిపణి కేంద్రాలు లక్ష్యంగా మారే అవకాశముంది. మరోవైపు, తమ గగనతలంలోకి వచ్చే ఏ విదేశీ విమానాన్నైనా క్షమించబోమని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఇప్పటికే గల్ఫ్ ప్రాంతంలో విమాన రాకపోకలు గణనీయంగా ప్రభావితమయ్యాయి. అంతేకాకుండా అంతర్జాతీయ నౌకాయానానికి కీలకమైన హర్ముజ్ జలసంధిపై ఆంక్షలు విధించడంతో ప్రపంచ వాణిజ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది.
ఈ యుద్ధ ఉద్రిక్తతలు అణు యుద్ధం లేదా పూర్తి స్థాయి భూతల యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ దేశాలు శాంతి చర్చలకు పిలుపునిస్తున్నా, పరిస్థితి మాత్రం రోజురోజుకు విషమిస్తోంది. గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. పరిస్థితి ఎలా మారుతుందో తెలియని ఈ సంక్షోభంలో, ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.








