ఏపీలో పాలు, నీళ్లు కల్తీ ఘటనలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న డయేరియా (Diarrhea), ఫుడ్ పాయిజన్ (Food Poisoning) ఘటనల నేపథ్యంలో ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చంద్రబాబు (Nara Chandrababu Naidu) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
“ఎవరైనా బ్రతకడానికి పాలు, నీళ్లు తాగుతారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ రెండూ ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి?” అంటూ జగన్ ప్రశ్నించారు. పలు ప్రాంతాల్లో కల్తీ పాలు (Adulterated Milk), కలుషిత నీరు (Contaminated Water) కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల జీవితంలో అత్యవసరమైన పాలు, నీటి పేరే వినగానే ఉలిక్కిపడే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందన్నారు.
టీడీపీ(TDP) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని ఆరోపించారు. డయేరియా, ఫుడ్ పాయిజన్ ఘటనలు తరుచూ వెలుగుచూస్తున్నాయని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. పరిపాలనపై పట్టు కోల్పోయిన ప్రభుత్వం ప్రతిపక్షంపై ఆరోపణలు చేయడం, అసత్య ప్రచారం చేయడంలోనే నిమగ్నమైందని విమర్శించారు.
కురుపాం గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో (Tribal Welfare Girls School) 16 మంది విద్యార్థినులు డయేరియాతో అస్వస్థతకు గురైన ఘటనను ఆయన ప్రస్తావించారు. వారిలో ఐదుగురిని ఆస్పత్రికి తరలించాల్సి వచ్చిందన్నారు. ఇదే పాఠశాలలో గతంలో కలుషిత నీటి కారణంగా ఇద్దరు బాలికలు మృతి చెందగా, దాదాపు 100 మంది విద్యార్థినులు అనారోగ్యానికి గురయ్యారని గుర్తుచేశారు. అయినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదని ఆరోపించారు.
గత 14 నెలల్లో హాస్టళ్లు, విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజన్, కలుషిత నీరు, అపరిశుభ్రత కారణంగా దాదాపు 25 ఘటనలు చోటుచేసుకున్నాయని, 15 జిల్లాల్లో 900 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని జగన్ తెలిపారు. జాతీయ మీడియా కూడా ఈ ఘటనలను ప్రముఖంగా ప్రచురించిందని పేర్కొన్నారు.
చేబ్రోలు, విజయవాడ, గుంటూరు, గుర్ల, శ్రీకాకుళం, తురకపాలెం ప్రాంతాల్లో గత 18 నెలల్లో పెద్దఎత్తున డయేరియా ప్రబలిందని, వందలాది మంది అనారోగ్యానికి గురై, డజన్ల కొద్దీ మరణాలు సంభవించాయని ఆరోపించారు. ముఖ్యంగా కలుషిత నీరు, అపరిశుభ్రత ప్రధాన కారణాలని అన్నారు.
ఇటీవల శ్రీకాకుళంలో (Srikakulam) కలుషిత నీటి కారణంగా ఐదుగురు మరణించగా, దాదాపు 200 మంది ఆస్పత్రుల పాలయ్యారని తెలిపారు. అదే వారం రాజమహేంద్రవరం నగరంలో కల్తీ పాల కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని, మరికొందరు వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. పోషణ ఇవ్వాల్సిన పాలు మరణానికి కారణమవడం దురదృష్టకరమని అన్నారు.
ఆహార భద్రత పర్యవేక్షణలో, నీటి నాణ్యత పరీక్షల్లో, హాస్టళ్ల పరిశుభ్రతలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జగన్ ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని లోపాలను గుర్తించి సరిదిద్దాలని, సురక్షిత నీటి సరఫరా, ఆహార భద్రత వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు. ప్రజలు ప్రభుత్వం నుంచి అద్భుతాలు ఆశించడం లేదని, మరిన్ని ప్రాణాలు కోల్పోకముందే తక్షణ చర్యలు తీసుకోవాలని మాత్రమే కోరుకుంటున్నారని జగన్ పేర్కొన్నారు.
Hello India,
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 27, 2026
People of Andhra Pradesh are dying after drinking milk and water. What should be, the most basic necessities of life, have turned into sources of fear. Under the TDP-led coalition government and Chief Minister @ncbn, repeated outbreaks of diarrhoea and food… pic.twitter.com/YaOts9IUcB








