మేము అధికారంలోకి వస్తామని, మా ఎంపీ ఏవియేషన్ మంత్రి అవుతారని మేము ఏమైనా కలగన్నామా..? అని కూటమి మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. అసెంబ్లీలో మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పలు రాజకీయ ఆరోపణలకు స్పందించారు. విమాన సంస్థ లావాదేవీల అంశంపై ఎన్సీపీ నేత (NSCP leader) రోహిత్ పవార్ (Rohit Pawar) చేసిన ఆరోపణలు, అవి సోషల్ మీడియాలో వైరల్ చేసిన నేపథ్యంలో లోకేష్ వివరణ ఇచ్చారు.
హెరిటేజ్–వీఎస్ఆర్ సంబంధంపై స్పష్టం
విమాన సంస్థ వీఎస్ఆర్ ఏవియేషన్ (VSR Aviation) వ్యవహారాన్ని ఉద్దేశిస్తూ వచ్చిన ఆరోపణలను లోకేష్ ఖండించారు. అజిత్ పవార్ (Ajit Pawar) వీఎస్ ఆర్ ప్లైట్ ఎక్కుతారని..అది ప్రమాదానికి గురవుతుందని కలగన్నామా? అని మీడియాను ప్రశ్నించారు. హెరిటేజ్‌కు వీఎస్ఆర్ ఏవియేషన్‌కు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదన్నారు. హెరిటేజ్ ఫిన్ లీస్ సంస్థ 1996లో స్థాపించబడిందని, 2022లో వీఎస్ఆర్ ఏవియేషన్ ఫైనాన్స్ తీసుకుందని తెలిపారు. ఇతర అనేక సంస్థల మాదిరిగానే వీఎస్ఆర్ కూడా సాధారణ రుణం తీసుకుందని చెప్పారు.
“మేము అధికారంలోకి వస్తామని, మా ఎంపీ ఏవియేషన్ మంత్రి అవుతారని ముందుగా కలగన్నామా..? ఎవరు ఏ ఫ్లైట్ ఎక్కుతారో, అది ప్రమాదానికి గురవుతుందో ముందే ఎలా తెలుసుకుంటాం?” అని ప్రశ్నించారు. వీఎస్ఆర్ ఏవియేషన్ వ్యవహారంపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.
ఇటీవల ప్రతీ విషయంలోని మూలాలు చంద్రబాబు కుటుంబ వ్యాపార సంస్థ వైపే చూపించడం తీవ్ర దుమారం రేపుతోంది. శ్రీవారి లడ్డూ తయారీ నెయ్యి అంశం, ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్ (Heritage) సంస్థకు మధ్య అనుబంధం, తాజాగా వీఎస్ఆర్ విమానయాన సంస్థకు హెరిటేజ్ సంస్థతో సంబంధం ఆరోపణలు.. ఇలా ప్రతీది హెరిటేజ్ సంస్థతో ముడిపడి ఉండడం చర్చనీయాంశంగా మారింది.







