ఇన్నర్ రింగ్ రోడ్ (IRR) (Inner Ring Road) కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) సంచలన విషయాలను బయటపెట్టారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ కేసులో గత, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనెల 18న సీఐడీ (CID) అధికారులు తనకు నోటీసులు ఇచ్చారని, 23న ఏసీబీ కోర్టు (ACB Court) నుంచి సమన్లు అందాయని వెల్లడించారు. 27వ తేదీన కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారని తెలిపారు.
భూముల కొనుగోలు.. అలైన్మెంట్ మార్పు
ఖాజా, నంబూరు, పెదకాకాని పరిధిలో 350 ఎకరాలు లింగమనేని రమేష్ (Lingamaneni Ramesh) కొనుగోలు చేశారని ఆరోపించారు. CRDA ఏర్పాటు తర్వాత కన్సల్టెన్సీ ద్వారా ఇన్నర్ రింగ్ అలైన్‌మెంట్‌ను ఆ భూములకు సమీపంగా ఉద్దేశపూర్వకంగానే మళ్లించారన్నారు. అప్పుడు IAS అధికారిగా ఉన్న నాగుళ్లపల్లి శ్రీకాంత్‌ను తప్పించి చెరుకూరు శ్రీధర్‌ను నియమించారని, STUP కన్సల్టెన్సీ ద్వారా ప్లాన్ మార్చారని ఆర్కే చెప్పారు.
RK హౌసింగ్ బినామీ పేరుతో మంత్రి నారాయణ కూడా భూములు కొనుగోలు చేశారని వివరించారు. కంతేరు సమీపంలో హెరిటేజ్ ఫుడ్స్ భూములు సైతం కొనుగోలు చేశారని, కోట్ల విలువైన భూములను హెరిటేజ్‌కు లింగమనేని రూ.8 లక్షలకు మాత్రమే ఎలా విక్రయించారని ప్రశ్నించారు. అలాగే పవన్ కళ్యాణ్‌కు రెండున్నర ఎకరాల భూములు విక్రయించారని పేర్కొన్నారు.
18 మందిని నిందితులుగా గుర్తింపు
ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించి సీఐడీకి ఫిర్యాదు చేశానని, తన కంప్లైంట్ ఆధారంగా చంద్రబాబు, నారాయణ, లోకేష్ తదితరులు సహా 18 మందిని నిందితులుగా సీఐడీ గుర్తించిందన్నారు. వందల సాక్ష్యాలు సేకరించిన తర్వాతే కేసులు నమోదు చేశారని తెలిపారు. ప్రభుత్వం మారిన తర్వాత ఈ కేసును “తప్పుడు కేసు”గా పేర్కొంటూ క్లోజ్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు దానిని తప్పు కేసుగా చెప్పడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు.
పోలీసు వ్యవస్థపై విమర్శలు
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వ్యవహారాలు ముఖ్యమంత్రి పర్యవేక్షణలోనే నడుస్తున్నాయని ఆరోపించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సీఐడీ అధికారి రవి శంకర్ ఆయన్నార్ చట్టానికి అనుగుణంగా పని చేయడం లేదని విమర్శించారు. బినామీ పేర్లతో అక్రమంగా ఆస్తులు సంపాదిస్తున్నారని, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు బయట పెడతానని చెప్పారు. ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు.
న్యాయపోరాటం కొనసాగిస్తా
ఏసీబీ కోర్టులో న్యాయం జరగకపోతే హైకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. సీఐడీ కేసు డాక్యుమెంట్లు ఇవ్వకుండా ప్రొటెస్ట్ పిటిషన్లు ఎలా వేస్తానని ప్రశ్నించారు. “చంద్రబాబు తప్పు చేయకపోతే IRR కేసులో విచారణను ఎదుర్కోవాలి” అని సవాల్ విసిరారు. తనపై ఒత్తిళ్లు తెచ్చి కేసులు వెనక్కు తీసుకోవాలని బెదిరించారని ఆరోపించారు. అయినప్పటికీ అవినీతి అంశాలపై న్యాయపోరాటం కొనసాగిస్తానని, చట్టం ముందు నిలబెడతానని స్పష్టం చేశారు. మొత్తానికి IRR అలైన్మెంట్ మార్పులు, భూముల కొనుగోళ్లు, అధికారుల పాత్రలపై చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.







