ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దుర్వినియోగంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ సాయంతో రూపొందించే కంటెంట్‌కు అది కృత్రిమ మేధతో సృష్టించబడిందని స్పష్టంగా తెలియజేసే విధంగా వాటర్‌మార్క్‌ను తప్పనిసరి చేయాలని ఆయన సూచించారు. ఏఐ ఆధారిత వీడియోలు, చిత్రాలు, ఆడియోలు తప్పుడు ప్రచారం, మోసాలు, డీప్‌ఫేక్‌లకు వేదిక కాకుండా కట్టడి చేయడానికి కఠిన నియంత్రణ చర్యలు అవసరమని పేర్కొన్నారు. స్పష్టమైన గుర్తింపు వ్యవస్థ ఉంటే ప్రజల్లో అవగాహన పెరిగి, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని నియంత్రించవచ్చని ప్రధాని అభిప్రాయపడ్డారు.
అదే సమయంలో, ఏఐ సాంకేతికత ఆవిష్కరణలకు, అభివృద్ధికి గొప్ప వేదిక అని మోడీ తెలిపారు. విజన్‌తో పాటు సామాజిక బాధ్యత కూడా అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. అణుశక్తి ఎలా విధ్వంసానికి, అభివృద్ధికి రెండింటికీ ఉపయోగపడిందో, ఏఐ కూడా అంతే ద్వంద్వ స్వభావం కలిగిన శక్తి అని పేర్కొన్నారు. “ఏఐ కత్తికి రెండు వైపులా పదునున్న అస్త్రం వంటిది” అంటూ జాగ్రత్తగా వినియోగించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. భారత్ యువత ఈ టెక్నాలజీని సృజనాత్మక శక్తిగా మలచగల సామర్థ్యం కలిగినవారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఏఐ మెషీన్ సెంట్రిక్‌గా కాకుండా హ్యూమన్ సెంట్రిక్‌గా ఉండాలని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. మనిషి ఏఐని నియంత్రించాలి కానీ, ఏఐ మనిషిని నియంత్రించే స్థితి రాకూడదని హెచ్చరించారు. మనం ఏఐకు ముడి సరుకుగా మారకూడదని, అన్ని రంగాల్లో సమస్యలకు పరిష్కారం చూపే సాధనంగా దాన్ని ఉపయోగించాలన్నారు. పారదర్శకతే అత్యుత్తమ రక్షణ కవచమని పేర్కొంటూ, బాధ్యతాయుతమైన వినియోగంతోనే ఏఐ భవిష్యత్తు సురక్షితంగా ఉండగలదని ఆయన వివరించారు.








