ఆంధ్రప్రదేశ్‌లో చిన్నారులు, మహిళలపై జరుగుతున్న దారుణ ఘటనలపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం పరిధిలోని నీరుగట్టువారిపల్లి గ్రామంలో ఏడేళ్ల బాలికపై జరిగిన హత్యాచార ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దారి తీసింది. ఈ ఘటనపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ ప్రభుత్వంపై మండిపడ్డారు. బాలిక మిస్సింగ్ ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు ఎందుకు కాపాడలేకపోయారని ప్రశ్నించారు.
వరుస ఘటనలపై తీవ్ర విమర్శలు
రాష్ట్రంలో బాలికలపై జరుగుతున్న పలు ఘటనలను ప్రస్తావిస్తూ ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో గిరిజన బాలిక హత్య, వైయస్ఆర్ కడప జిల్లాలో చిన్నారిపై అత్యాచారం తర్వాత హత్య, తిరుపతి జిల్లాలో మరో ఘటనలన్నీ రాష్ట్రంలో భద్రత పరిస్థితి దారుణంగా మారిందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేదని విమర్శించారు. ప్రకటనలకే పరిమితమై చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు.
అలాగే తూర్పుగోదావరి జిల్లాలోని బిక్కవోలు మండలం రంగాపురం గ్రామంలో మైనర్ బాలికపై దాడి ఘటనలో పోలీసుల వ్యవహారం ప్రశ్నార్థకమైందని చెప్పారు. అధికార పార్టీ తెలుగు దేశం పార్టీ ఒత్తిడితో బాధితులపైనే కేసులు పెట్టారనే ఆరోపణలను ప్రస్తావించారు. చిన్నారులు, మహిళల భద్రతపై తక్షణ చర్యలు తీసుకోవాలని, లా అండ్ ఆర్డర్‌పై దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రభుత్వానికి విజ్ఞప్తి
లా అండ్ ఆర్డర్‌ను బలోపేతం చేసి మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించాలని జగన్ డిమాండ్ చేశారు. పాలనా వైఫల్యాల వల్ల అమాయక బాలికలు బలైపోకూడదని అన్నారు. “చంద్రబాబుగారూ, ఇకనైనా మేల్కొని చర్యలు తీసుకోండి” అని ఆయన విజ్ఞప్తి చేశారు.







