ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మదనపల్లిలో చోటుచేసుకున్న 7 ఏళ్ల చిన్నారి హత్యాచారం ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసులో నిందితుడిగా గుర్తించిన కులవర్ధన్ మృతదేహం చెరువులో లభించడం మరో మలుపు తీసుకుంది. మదనపల్లిలోని నీరుగట్టువారిపల్లికి చెందిన ఓ చేనేత కార్మికుడి కుటుంబానికి చెందిన ఏడేళ్ల బాలిక ఈ నెల 16వ తేదీ సాయంత్రం కనిపించకుండా పోయింది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా ఎదురుగా ఉన్న ఇంట్లో ఉన్న ఓ డ్రమ్‌లో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. బాలికను మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేసి అనంతరం హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఆగ్రహావేశంలో ప్రజలు
ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడి ఇంటి వద్ద పెద్ద ఎత్తున ప్రజలు చేరుకుని నిరసనలు చేపట్టారు. హిజ్రాలు, స్థానికులు కలిసి ఆందోళనకు దిగారు. నిందితుడిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని, లేకపోతే తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
చెరువులో నిందితుడి మృతదేహం
ఈ నేపథ్యంలో కులవర్ధన్ మృతదేహం కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని కణసానోలపల్లి చెరువులో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. అతను ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఇతర కారణాల వల్ల మృతి చెందాడా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజాలు వెలికితీయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.








