చారిత్రాత్మక ICC Men’s T20 World Cupలో భారత్ అద్భుత ప్రదర్శనతో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-A మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఇండియా క్రికెట్ టీం వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుని సూపర్ 8కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఈ విజయంతో టీమ్ ఇండియా అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకుంది.
టి20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ప్రత్యర్థిపై ఎనిమిది విజయాలు సాధించిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. ఇరు జట్ల మధ్య జరిగిన తొమ్మిది మ్యాచ్‌లలో భారత్ ఎనిమిది సార్లు గెలవగా, పాకిస్తాన్ ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. ప్రపంచకప్ వేదికపై భారత్ ఆధిపత్యం మరింత బలపడిందని ఈ గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 175/6 పరుగుల భారీ స్కోరు చేసింది. యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులతో చెలరేగి వరుసగా రెండో మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 32 పరుగులతో జట్టుకు బలాన్నిచ్చాడు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ భారత బౌలర్ల దాటికి తట్టుకోలేక 18 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో పాకిస్తాన్‌పై భారత్ 100 శాతం విజయాలను కొనసాగిస్తూ పూర్తి ఆధిపత్యాన్ని చాటింది. మొత్తం టి20 అంతర్జాతీయ రికార్డులో కూడా భారత్ 14-3 ఆధిక్యంతో దూసుకుపోతూ ప్రపంచ క్రికెట్‌లో నంబర్ వన్ జట్టుగా తన స్థాయిని మరోసారి నిరూపించింది.








