కుప్పంలో నకిలీ పాల త‌యారీ ముఠా.. వెలుగులోకి సంచలన విషయాలు (Video)

కుప్పంలో నకిలీ పాల త‌యారీ ముఠా.. వెలుగులోకి సంచలన విషయాలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన కుప్పం నియోజకవర్గం మరో వివాదంలో చిక్కుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం ప్రాంతానికి చెందిన వ్యక్తులు నకిలీ పాల తయారీ ముఠాకు ప్రధాన సూత్రధారులుగా బయటపడటం తీవ్ర కలకలం రేపుతోంది. సరిహద్దు రాష్ట్రం కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఈ దందా వెలుగులోకి వచ్చింది.

కోలార్‌లో పట్టుబడ్డ నకిలీ పాలు
కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా పరిధిలో జనవరి 15న భారీ ఎత్తున నకిలీ పాలు క్యాన్లు పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసుల సంయుక్త దాడుల్లో నకిలీ పాల తయారీ కేంద్రాలను గుర్తించారు. కోలార్ జిల్లా బల్లగిరి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని ఈ అక్రమ దందా సాగుతున్నట్లు అధికారులు నిర్ధారించారు.

కాలం చెల్లిన పాల పౌడర్‌తో పాల తయారీ
పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కాలం చెల్లిన పాల పౌడర్, పామాయిల్, చక్కెర, బెల్లం, ఇతర హానికర రసాయనాలను మిక్సీలో కలిపి పాల క్రీమ్ తయారు చేస్తున్నట్లు వెల్లడైంది. నాలుగు లీటర్ల క్రీమ్‌కు దాదాపు 20 లీటర్ల నీటిని కలిపి నకిలీ పాలను తయారు చేసి మార్కెట్లోకి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నకిలీ పాలు ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా మారినట్లు పేర్కొన్నారు.

కుప్పం నియోజకవర్గానికే నిందితుల లింక్
ఈ నకిలీ పాల ముఠాకు సంబంధించిన ప్రధాన నిందితులు కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం బోయినపల్లి, గంగిశెట్టిపల్లి గ్రామాలకు చెందినవారని కోలార్ జిల్లా పోలీసులు వెల్లడించారు. మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ముఠా నకిలీ పాలను కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు సరఫరా చేసినట్లు అనుమానిస్తున్నారు.

ప్రజారోగ్యంపై తీవ్ర ఆందోళన
నకిలీ పాలు చిన్నారులు, వృద్ధులు, గర్భిణుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన కుప్పం నియోజకవర్గంలో రాజకీయంగానూ, సామాజికంగానూ తీవ్ర చర్చకు దారి తీస్తోంది. నకిలీ పాల తయారీ వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను గుర్తించి, సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనతో సరిహద్దు ప్రాంతాల్లో ఆహార భద్రతపై మరింత కఠిన నిఘా అవసరమన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment