రైతుల అప్పుల లిస్ట్‌లో ఏపీ ఫ‌స్ట్ – కేంద్రం షాకింగ్ డీటైల్స్

అప్పుల ఊబిలో ఏపీ, తెలంగాణ‌ రైతులు - కేంద్రం షాకింగ్ డీటైల్స్

దేశానికే త‌ల‌మానికంగా అన్న‌పూర్ణ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌గా ఉన్న రాష్ట్రం నేడు అప‌కీర్తిని మూట‌గ‌ట్టుకుంది. దేశ వ్యాప్తంగా అప్పుల ఊబిలో ఉన్న రైతుల జాబితాలో ఏపీ మొద‌టి స్థానంలో నిలిచింది. దేశంలో రైతులు అత్యధికంగా అప్పులు కలిగి ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టాప్–5లో నిలిచాయి. ఏపీ మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ ఐదో స్థానంలో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది.

టీఎంసీ ఎంపీ కలిపడ సోరెన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఈ కీలక వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా రైతుల అప్పుల పరిస్థితిపై విడుదలైన ఈ గణాంకాలు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను ఆందోళన కలిగిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం, జూలై 2018 నుంచి జూన్ 2019 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లో రైతు కుటుంబంపై సగటు అప్పు రూ.2,35,554గా ఉంది. ఇది దేశంలోనే అత్యధికంగా నమోదు కావడం గమనార్హం. అదే కాలంలో తెలంగాణలో రైతు కుటుంబంపై సగటు అప్పు రూ.1,52,113గా ఉంది. దేశవ్యాప్తంగా రైతు కుటుంబాలపై సగటు అప్పు రూ.74,121 మాత్రమే ఉండటం విశేషం. జాతీయ సగటుతో పోలిస్తే ఏపీ, తెలంగాణ రైతులపై అప్పుల భారం ఎంత తీవ్రమో ఈ గణాంకాలు స్పష్టంగా చూపిస్తున్నాయి.

వ్యవసాయ వ్యయాలు పెరగడం, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, వరుసగా ఎదురవుతున్న ప్రకృతి వైపరీత్యాలు, మార్కెట్ అనిశ్చితి వంటి కారణాలు రైతులను అప్పుల ఊబిలోకి నెట్టుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైతుల ఆర్థిక స్థితి మెరుగుపడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే సమర్థవంతమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment