జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాసలీలల వ్యవహారంలో హైడ్రామా కొనసాగుతోంది. అరవ శ్రీధర్ వ్యవహారం రోజురోజుకీ మరింత వివాదాస్పదంగా మారుతోంది. ఓ దళిత మహిళకు అన్యాయం చేసిన ఘటనపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా, జనసేన పార్టీ మాత్రం ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మళ్లీ రైల్వే కోడూరుకు త్రిసభ్య కమిటీ
ఈ వివాదంపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జనసేన త్రిసభ్య కమిటీ నేడు మరోసారి రైల్వే కోడూరు రానుంది. ఇప్పటికే ఈ కమిటీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌తో పాటు పలువురు కార్యకర్తలను విచారించినప్పటికీ, ఇప్పటివరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఎలాంటి నివేదిక సమర్పించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. విచారణ పేరుతో కాలయాపన చేస్తూ, ఎమ్మెల్యేను కాపాడే ప్రయత్నమే జరుగుతోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ సీరియస్ అంటూ లీకులు
ఇటీవల జరిగిన జనసేన ఎమ్మెల్యేల సమావేశంలో ఈ అంశంపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు లీకులు ఇచ్చాయి. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవన్న సంకేతాలు ఇచ్చారని సమాచారం. అయినప్పటికీ, గ్రౌండ్ లెవెల్‌లో మాత్రం ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.
పార్టీకి చెడ్డపేరు రాకూడదనే కాలయాపనా?
జనసేన త్రిసభ్య కమిటీ నివేదిక ఆలస్యం చేయడం వెనుక పార్టీకి తాత్కాలికంగా నష్టం రాకూడదన్న ఆలోచన ఉందా? లేక ఎమ్మెల్యేను కాపాడేందుకే విచారణను సాగదీస్తున్నారా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ తుది నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. దళిత మహిళకు న్యాయం జరుగుతుందా? లేక రాజకీయ లెక్కలతో ఈ కేసు కూడా నీరుగారిపోతుందా? అన్న ప్రశ్నలకు సమాధానం రావాల్సిన సమయం ఆసన్నమైంది.








ఆది ‘కమ్మగా’ వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు – ఏపీ బీజేపీ చీఫ్