కాలేజీలో కాల్పుల మోత మోగింది. పంజాబ్‌లోని తార్న్ తారన్ జిల్లా ఉస్మా గ్రామంలో ఉన్న ఒక లా కాలేజీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తరగతి ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందు, ఫస్ట్ ఇయర్ లా విద్యార్థి తన సహవిద్యార్థినిపై కాల్పులు జరిపి హత్య చేసిన అనంతరం, అదే తుపాకితో తనపై తానే కాల్చుకున్నాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం లెక్చర్ ప్రారంభం కావడానికి ముందు నిందితుడు ప్రిన్స్ రాజ్ కాలేజీ క్లాస్‌రూమ్‌లోకి ప్రవేశించాడు. అకస్మాత్తుగా పిస్టల్ బయటకు తీసి తన సహచర విద్యార్థిని సందీప్ కౌర్‌పై కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. బుల్లెట్ ఆమె తలలో తగలడంతో సంఘటన స్థలంలోనే ఆమె మృతి చెందింది.
ఆ తర్వాత ప్రిన్స్ రాజ్ అదే తుపాకీతో తనను తాను కాల్చుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. మృతురాలు సందీప్ కౌర్, నిందితుడు ప్రిన్స్ రాజ్ ఇద్దరూ అదే కాలేజీలో ఫస్ట్ ఇయర్ లా కోర్సులో చదువుతున్నారని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జగ్బీర్ సింగ్ తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
క్లాస్‌రూమ్‌లో భయానక దృశ్యాలు
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లో తరగతి గదిలో కొంతమంది విద్యార్థులు కూర్చున్న సమయంలో, ఒక యువకుడు డెస్క్ దగ్గర నిలబడి తుపాకీ ఎత్తి కాల్పులు జరిపిన దృశ్యాలు నమోదయ్యాయి. వెంటనే విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొని, పలువురు క్లాస్‌రూమ్ నుంచి పరుగులు తీసినట్లు వీడియోలో కనిపిస్తోంది.
తుపాకీ స్వాధీనం.. ఫోరెన్సిక్ పరిశీలన
కాల్పుల్లో ఉపయోగించిన పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ బృందాలను సంఘటన స్థలానికి పంపించి ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటన సమయంలో క్యాంపస్‌లో ఉన్న విద్యార్థులు, సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పూర్తిగా పరిశీలించి ఘటనకు గల అసలు కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన విద్యా సంస్థల్లో భద్రతపై తీవ్ర ఆందోళనలకు దారి తీసింది. కాలేజీ ప్రాంగణంలో తుపాకీ ఎలా ప్రవేశించిందన్న అంశంపై కూడా పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు.








