మేడారం జాతర సందర్భంగా లైంగిక దాడి ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. జాతర జరుగుతున్న సమయంలో 13 ఏళ్ల బాలికపై ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు యువకులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారంటూ వార్తా సంస్థలు, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించిన కమిషన్ వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ విజయా రాహత్కర్ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. బాలికపై జరిగినట్లు ప్రచారం అవుతున్న లైంగిక దాడి ఆరోపణలు నిజమైతే అది అత్యంత అమానుష చర్యగా పేర్కొంటూ, బాధితురాలికి న్యాయం జరిగేలా అన్ని కోణాల్లో విచారణ జరగాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక యంత్రాంగం తీసుకున్న చర్యలపై కూడా నివేదిక కోరనున్నట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు జాతీయ మహిళా కమిషన్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి NCW సభ్యురాలు డెలినా అధ్యక్షత వహించనుండగా, సభ్యురాలిగా కంచన్ కట్టర్ ఉన్నారు. కమిటీ ఈరోజు నుంచే విచారణను ప్రారంభించనుంది. బాధితురాలి పరిస్థితి, ఘటన జరిగిన తీరు, భద్రతా ఏర్పాట్లు, పోలీసుల స్పందన తదితర అంశాలను కమిటీ పరిశీలించనుంది.
మేడారం జాతర వంటి మహత్తర ఆదివాసీ పండుగలో ఈ తరహా ఆరోపణలు వెలుగులోకి రావడం పట్ల మహిళా సంఘాలు, సామాజిక వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కోట్లాది మంది భక్తులు హాజరయ్యే జాతరలో మహిళలు, బాలికల భద్రతపై మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.








