మణిపూర్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి నుంచి అమలులో ఉన్న రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేస్తూ హోం మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. మణిపూర్‌లో ఫిబ్రవరి 13తో రాష్ట్రపతి పాలన ముగుస్తుండడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
ఇంఫాల్‌లోని లోక్ భవన్‌లో మణిపూర్ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్డీఏ శాసనసభా పక్ష నాయకుడు వై. ఖేమ్‌చంద్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు బీజేపీ ధృవీకరించింది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచే లోక్ భవన్‌లో భారీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
వై. ఖేమ్‌చంద్ సింగ్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రతినిధి బృందం గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అధికారికంగా మద్దతు లేఖను సమర్పించింది. రాజకీయంగా కీలకంగా భావిస్తున్న కుకి ప్రాబల్య జిల్లాలైన చురాచంద్‌పూర్, ఫెర్జాల్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఈ బృందంలో ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఖేమ్‌చంద్ సింగ్‌ను మొదట బీజేపీ, ఆ తర్వాత ఎన్డీఏ శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. మే 2023లో మైతీ–కుకీ వర్గాల మధ్య జరిగిన తీవ్ర జాతి హింస నేపథ్యంలో అప్పటి సీఎం ఎన్. బిరేన్ సింగ్ రాజీనామా చేయడంతో రాష్ట్రపతి పాలన విధించబడింది. ఆ హింసలో వేలాది మంది నిరాశ్రయులవగా, ఇప్పుడు కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పుతుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి.







