తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి హామీల విషయంలో విఫలమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట తప్పి ముఖం చాటేశారని మండిపడ్డారు. ఇది ఐదేళ్ల హామీ అంటూ మాట మార్చడంపై నిరుద్యోగ యువత తీవ్ర ఆగ్రహంతో ఉందన్నారు. కేసీఆర్ పాలనలో చివరి దశలో ఉన్న 65 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి ఫోటోలకు ఫోజులిచ్చిన సీఎం, ఆ తర్వాత మొత్తం నియామకాలకే చేతులెత్తేయడంతో తెలంగాణ ‘రిక్రూట్‌మెంట్ జీరో’ రాష్ట్రంగా మారిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇప్పటికే లక్షా 65 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు కనీసం పది వేల కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు.
జాబ్ క్యాలెండర్‌ను పాతర వేసి, వరుస కుంభకోణాలతో ప్రభుత్వ పెద్దలు తమ జేబులు నింపుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. రెండు లక్షల ఉద్యోగాల హామీపై నాలుక మడతేసినంత మాత్రాన నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు మౌనంగా ఉంటారని అనుకోవడం భ్రమేనన్నారు. నిరుద్యోగులను నమ్మించి మోసం చేసినందుకు సీఎం క్షమాపణలు చెప్పినా, పొర్లుదండాలు పెట్టినా క్షమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి పేరుతో చేసిన ద్రోహానికి గుణపాఠం చెప్పేందుకు ఆదిలాబాద్ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకూ ప్రతి నిరుద్యోగి సిద్ధంగా ఉన్నాడన్నారు. రైతుబంధు ఎగ్గొట్టి రైతులను మళ్లీ అప్పులపాలు చేశారని, కేసీఆర్ పాలనలో ఆత్మగౌరవంతో బతికిన రైతన్నను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసిందని కేటీఆర్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.







