తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల్లో పార్టీ క్రమశిక్షణకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని రాంచందర్ రావు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ అధికారికంగా బి-ఫాం ఇచ్చిన అభ్యర్థులకే స్థానిక నేతలు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. రెబల్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన వారు వెంటనే తమ నామినేషన్లు ఉపసంహరించుకోవాలని సూచించారు. రేపటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనున్న నేపథ్యంలో పార్టీ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.
రెబల్‌గా పోటీ చేస్తే 15 ఏళ్ల సస్పెన్షన్
పార్టీ నిర్ణయాలను విస్మరించి రెబల్‌గా ఎన్నికల్లో పోటీ చేస్తే, సంబంధిత నేతలను 15 ఏళ్లపాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని రాంచందర్ రావు హెచ్చరించారు. అంతేకాకుండా, ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన వారిని భవిష్యత్తులో బీజేపీలోకి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
సర్వేలు, సామాజిక సమీకరణాల ఆధారంగా టిక్కెట్లు
మున్సిపల్ ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు పూర్తిగా సర్వేలు, సామాజిక సమీకరణాలు, గెలుపు అవకాశాల ఆధారంగానే జరిగిందని ఆయన తెలిపారు. టిక్కెట్ రాకపోయినా పార్టీ కార్యకర్తలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, భవిష్యత్తులో వారికి తగిన గౌరవం, గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు. బీజేపీ ఎదుగుదలలో కార్యకర్తల పాత్ర కీలకమని రాంచందర్ రావు అన్నారు. పార్టీ క్రమశిక్షణను కాపాడుతూ, అధికారిక అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు పిలుపునిచ్చారు.







