ఫోన్ ట్యాపింగ్ కేసు.. రగులుతున్న తెలంగాణ సెంటిమెంట్

ఫోన్ ట్యాపింగ్ కేసు.. రగులుతున్న తెలంగాణ సెంటిమెంట్

ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆదివారం విచారించింది. నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో జరిగిన ఈ విచారణ దాదాపు 4 గంటల 45 నిమిషాలు కొనసాగింది. ముందుగానే అవసరమైన ఏర్పాట్లు చేసుకున్న సిట్ అధికారులు కేసీఆర్ ఇంటి రెండో అంతస్తులో విచారణ నిర్వహించారు.

కేసీఆర్‌ను కావాలనే ఇబ్బందిపెడుతున్నారా?
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్‌ను, ఆయన స్థాపించిన పార్టీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోందన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. చట్ట ప్రకారం ఎవరినైనా విచారణకు పిలవడం సబబేనని భావించినా, మున్సిపల్ ఎన్నికల కారణంగా తాను బిజీగా ఉన్నానని, మరో తేదీ ఇవ్వాలని కేసీఆర్ సిట్‌కు లేఖ రాసినప్పటికీ, మరుసటి రోజే విచారణకు హాజరు కావాలని మ‌రో నోటీసు ఇవ్వడం బీఆర్‌ఎస్ శ్రేణులు, తెలంగాణ వాదులను ఆలోచింపజేస్తోంది. ఇది కావాలనే కేసీఆర్‌ను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నంగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రేవంత్ వ్యాఖ్యలపై తెలంగాణ వాదుల ఆగ్రహం
ఇటీవల ఖమ్మంలో జరిగిన సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా వ్యవహరించిన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం తెలంగాణ వాదుల ఆగ్రహానికి ప్రధాన కారణంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజకీయంగా లాభం చేకూర్చే విధంగా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోష‌ల్ మీడియాలోనూ టీడీపీ శ్రేణులు కేసీఆర్‌ను, ఆయ‌న కుటుంబాన్ని బూతులు తిట్ట‌డం, తెలంగాణ‌తో సంబంధం లేని వ్య‌క్తులు బీఆర్ఎస్ నాయ‌క‌త్వాన్ని అస‌భ్య‌క‌రంగా మాట్లాడుతుండ‌డం, ఇదే సమయంలో, కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, సీనియర్ నేతలపై చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు తప్పుడు కథనాలు ప్రచారం చేయడం కూడా తెలంగాణ వాదుల్లో అసంతృప్తిని పెంచుతోందని విశ్లేషకులు అంటున్నారు.

మళ్లీ ఉద్యమ సెంటిమెంట్?
రేవంత్ రెడ్డి ప్రభుత్వ వ్యవహార శైలి వల్ల తెలంగాణలో మళ్లీ ఉద్యమ సెంటిమెంట్ రగిలే పరిస్థితి ఏర్పడుతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కేసీఆర్ సిట్ విచారణ చుట్టూ జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. ఇక ముందుముందు ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment