కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారు. లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం, బడ్జెట్ ప్రతిని రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టనున్నారు.
బడ్జెట్ ప్రసంగంలో దేశ ఆర్థిక పరిస్థితిపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల మధ్య కూడా భారత ఆర్థిక ప్రయాణం స్థిరంగా కొనసాగుతోందని చెప్పారు. “సవాళ్ల మధ్య ముందుకు సాగుతున్నాం. సంస్కరణల దిశగా ప్రభుత్వం నిరంతరం అడుగులు వేస్తోంది. భారత్ ప్రస్తుతం 7 శాతం ఆర్థిక వృద్ధితో దూసుకెళ్తోంది” అని ఆమె తెలిపారు.
భారత్ ఆర్థిక స్థిరత్వంపై నిర్మలా వ్యాఖ్యలు చేశారు. అనిశ్చిత పరిస్థితుల్లోనూ దేశం ముందుకు సాగుతోంది. ఎగుమతులపై ఆధారపడటం గణనీయంగా తగ్గింది. ఆర్థిక సంస్కరణలను కొనసాగిస్తున్నాం. భారత్ ప్రపంచ మార్కెట్లతో మరింత బలంగా అనుసంధానమవుతోంది అని ఆమె చెప్పారు.
మూడు కర్తవ్యాలతో బడ్జెట్ రూపకల్పన
ఈ బడ్జెట్‌ను మూడు ముఖ్య కర్తవ్యాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. పవిత్ర మాఘ పూర్ణిమ రోజున బడ్జెట్ ప్రవేశపెట్టడం విశేషమని ఆమె పేర్కొన్నారు. వికసిత భారత్ లక్ష్యంగా యువత ఆకాంక్షలను ప్రతిబింబించేలా బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు.
సమగ్ర అభివృద్ధే లక్ష్యం
పేదలు, బలహీన వర్గాలు, దళితులు, ఆదివాసీల అభివృద్ధే ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యమని నిర్మలా స్పష్టం చేశారు. సమాజంలోని ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. దేశాన్ని ఆర్థికంగా బలమైన, స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడమే ఈ బడ్జెట్ ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.








