‘కూటమిలో జనసేనకు అన్యాయం’ – బొలిశెట్టి సంచ‌ల‌న వీడియో

'కూటమిలో జనసేనకు అన్యాయం' - బొలిశెట్టి సంచ‌ల‌న వీడియో

కూటమి ప్రభుత్వ పనితీరుపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ఒప్పందం క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని, జనసేనకు తగిన గౌరవం, ప్రాతినిధ్యం దక్కడం లేదని ఆయన విమర్శించారు. పదవుల కేటాయింపులో పారదర్శకత లేకపోవడం వల్ల జనసేన కార్యకర్తల్లో తీవ్ర నిరుత్సాహం నెలకొందన్నారు. ఈ మేర‌కు జ‌న‌సేనకు అన్యాయం జ‌రుగుతుందంటూ బొలిశెట్టి విడుద‌ల చేసిన వీడియో వైర‌ల్‌గా మారింది.

కూటమిలో ఒప్పుకున్న 60-30-10 విధానం ప్రస్తుతం కాగితాలకే పరిమితమైందని బొలిశెట్టి స్పష్టం చేశారు. ప్రభుత్వ పదవులు, నామినేటెడ్ పోస్టుల విషయంలో జనసేనకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా దేవాలయ కమిటీల్లో జనసేనకు ప్రాతినిధ్యం లేకపోవడం ఆందోళనకరమని తెలిపారు.

విశాఖ ఈస్ట్ నియోజకవర్గంలో ఇటీవల ఏర్పాటు చేసిన ఐదు దేవాలయ కమిటీల్లో ఒక్కటిలో కూడా జనసేనకు చోటు ఇవ్వలేదని బొలిశెట్టి వెల్లడించారు. ఇది కూటమి భాగస్వామిగా ఉన్న జనసేనను పూర్తిగా పక్కన పెట్టినట్లేనన్నారు. జనసేన కోసం పనిచేయని వ్యక్తులకు పార్టీ పేరుతో పదవులు ఇచ్చారని, ఇది కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తీవ్ర అన్యాయం అని పేర్కొన్నారు.

ఈ పరిస్థితుల వల్ల జనసేన కార్యకర్తలు, వీర మహిళల్లో తీవ్ర అసంతృప్తి, నిరుత్సాహం పెరుగుతోందని బొలిశెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పార్టీ కోసం త్యాగాలు చేసిన జనసేన శ్రేణులకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని అన్నారు. పదవుల కేటాయింపులో స్పష్టత, పారదర్శకత పాటించకపోతే జనసేన మళ్లీ పోరాటాలకు సిద్ధం కావాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. జనసేన త్యాగాన్ని తేలికగా తీసుకుంటే అది కూటమికే నష్టం కలిగిస్తుందన్నారు. ఇప్పటికైనా కూటమి నేతలు స్పందించి జనసేనకు న్యాయం చేయాలని బొలిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment