తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను కూడా విచారించేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు, ఆయన పీఏకు అధికారికంగా నోటీసులు అందజేశారు.
నోటీసుల్లో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని స్పష్టంగా పేర్కొన్నారు. అయితే కేసీఆర్ వయసును దృష్టిలో ఉంచుకుని, ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాల్సిన అవసరం లేదని సిట్ అధికారులు తెలిపారు. సీఆర్పీసీ 160 సెక్షన్ ప్రకారం 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. అందువల్ల కేసీఆర్ కోరుకున్న ప్రదేశంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు వెల్లడించారు.
అయితే ఆ ప్రదేశం తప్పనిసరిగా హైదరాబాద్ నగర పరిధిలో ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్ నగర పరిధి అనే షరతు నేపథ్యంలో, నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామంతో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ మరింత ఉత్కంఠను రేపుతోంది.







