బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులకు (23 Indian Fishermen) ఎట్టకేలకు విముక్తి లభించింది. ద్వైపాక్షిక ఒప్పందాల మేరకు బంగ్లాదేశ్ హోం మంత్రిత్వశాఖ (Bangladesh Home Ministry) వీరి విడుదలకు అనుమతి ఇవ్వడంతో, ఉత్తరాంధ్రకు (North Andhra) చెందిన 9 మంది మత్స్యకారులకు, వారి కుటుంబాలకు ఊరట లభించింది.
వీరిలో ఎక్కువ మంది విజయనగరం జిల్లాకు చెందినవారే కావడంతో, ఆ కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. వీరితో పాటు పశ్చిమ బెంగాల్‌కు చెందిన మరో 14 మంది మత్స్యకారులను కూడా విడుదల చేశారు. భారత ప్రభుత్వ జోక్యం, రెండు దేశాల మధ్య జరిగిన చర్చల ఫలితంగానే ఈ విడుదల సాధ్యమైందని కుటుంబ సభ్యులు భావోద్వేగంగా తెలిపారు.
బాగర్హాట్ జైలులో నిర్బంధంలో ఉన్న మత్స్యకారులను విడుదల చేసిన అనంతరం, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మోంగ్లా పోర్టుకు తరలించారు. బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ స్వాధీనం చేసుకున్న వారి బోటుకు మరమ్మతులు పూర్తయ్యాక, రేపు బోటు ద్వారానే భారత్‌కు తిరుగు ప్రయాణం చేపట్టనున్నారు.
గత ఏడాది అక్టోబర్‌లో పశ్చిమ బెంగాల్ తీరంలో వేట సాగిస్తున్న సమయంలో అనుకోకుండా అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించడంతో బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ వారిని అరెస్ట్ చేసింది. విడుదల వార్తతో మత్స్యకార కుటుంబాలు ఊపిరి పీల్చుకుని, తమ వారి రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నామని వెల్లడించాయి.








‘ఆ హైదరాబాద్ వాడిని రానివ్వొద్దు.. వస్తే ఖతం చేస్తాడు!’