గణతంత్ర వేడుకల్లో (Republic Day celebrations) గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazeer) ప్రసంగం తప్పుల తడక అని వైసీపీ (YSRCP) అభిప్రాయపడింది. గవర్నర్ ప్రసంగం పచ్చి అబద్ధాలతో నిండిపోయిందని, గవర్నర్‌తో కూడా కూటమి ప్రభుత్వం అసత్యాలు మాట్లాడించిందని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ (Velampalli Srinivasa Rao) తీవ్రంగా విమర్శించారు. రిపబ్లిక్ డే రోజున కూడా గవర్నర్ చేత పచ్చి అబద్ధాలు చెప్పించటం దుర్మార్గమని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అబద్ధాలతోనే రాజకీయాలు చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు ‘సూపర్ సిక్స్’ (Super Six)పేరుతో ప్రజలను మోసం చేశారని తెలిపారు. జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేశారని వెలంపల్లి విమర్శించారు. 23 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటూ చంద్రబాబు మోసపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. 30 లక్షల మంది విద్యార్థులకు ‘తల్లికి వందనం’ (Talliki Vandanam Scheme) పథకం అందలేదన్నారు. ఏ రైతు కూడా సంతోషంగా లేడని, అన్నదాత సుఖీభవ, ఉచిత సిలిండర్ పథకాల పేరుతో రైతులు, మహిళలను మోసం చేశారన్నారు. జగన్ ప్రభుత్వంలో ‘జగన్ చేయూత’ (Jagan Cheyutha Scheme) కింద రూ.18 వేలు ఇచ్చామని గుర్తుచేశారు.
పీ4 ప్రాజెక్టు (P4 Project) పేరుతో మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారని, పీ4ను గొప్పగా అమలు చేస్తున్నామంటూ గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారని విమర్శించారు. పెన్షన్లను 5 లక్షల మందికి తగ్గించి వృద్ధులు, వితంతువులను మోసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దలు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరగడం తప్ప ప్రజల కోసం ఏమీ చేయటం లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో ఏ వర్గమూ సంతోషంగా లేదని స్పష్టం చేశారు. మంత్రి లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా నాశనం అయ్యాయని ఆరోపించారు.
అమరావతి రైతులను చంద్రబాబు మోసం చేశారని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వేధిస్తున్నారని విమర్శించారు. మందడంలో రైతు రామారావు మృతికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతిని అడ్డం పెట్టుకుని, భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా హోంమంత్రి మౌనంగా ఉన్నారని విమర్శించారు. జగన్‌ను విమర్శించడం తప్ప హోంమంత్రికి ఇంకేమీ పని లేదన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడికి సిగ్గులేని మాటలు మాట్లాడటం అలవాటేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2014–19 మధ్య తమ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు స్పీకర్ ఏం చేశారని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోయిన సందర్భాల్లో స్పీకర్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. కూటమి ప్రభుత్వం అబద్ధాల పునాదులపై నడుస్తోందని, ప్రజలు ఈ మోసాలను గమనిస్తున్నారని వెలంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.








