సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో (Social Welfare Girls Gurukula School) తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఆటో నుంచి కిందపడి 8వ తరగతి విద్యార్థిని సంగీత (Sangeetha) (14) మృతి చెందింది. ఈ ఘటనతో కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం క్యాంప్‌లోని గురుకుల స్కూల్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతిచెందిన సంగీత మద్నూర్ మండలం కొడిచిర గ్రామానికి చెందిన బాలికగా గుర్తించారు.
వివరాల్లోకి వెళితే.. బోర్లం క్యాంప్ ఎస్సీ గురుకుల పాఠశాలలో విద్యార్థిని సంగీత 8వ తరగతి చదువుతోంది. ఇన్ఛార్జి ప్రిన్సిపల్ (In-charge Principal) సునీత (Sunitha) ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్ (Function) కోసం పాఠశాల నుంచి ఫర్నిచర్‌ను ఆటోలో తరలించారు. ఫంక్షన్ అనంతరం ఆ ఫర్నిచర్‌ను తిరిగి పాఠశాలకు తీసుకొస్తున్న క్రమంలో సంగీత కూడా ఆటోలో ప్రయాణించింది.
ఈ సమయంలో ఆటో నుంచి జారి పడిన సంగీత తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన స్థలంలోనే ఆమె ప్రాణాలు విడిచినట్లు సమాచారం. వెంటనే ఆమెను బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
విద్యార్థిని మృతితో గురుకుల పాఠశాలలో విషాద వాతావరణం నెలకొంది. సంగీత మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సంగీత మృతి పూర్తిగా ప్రిన్సిపల్ నిర్లక్ష్యమే కారణమంటూ తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల ముందు ధర్నాకు దిగారు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు పాఠశాల పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినట్లు తెలుస్తోంది. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకుని తల్లిదండ్రులను సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంపై నిరసనలు వెల్లువెత్తుతుండటంతో బోర్లం గురుకుల పాఠశాల వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది.







