ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)కు సిట్ నోటీసులు (SIT Notices) జారీ చేయడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. నేడు సిట్ విచారణకు హాజరయ్యే ముందు తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన కేటీఆర్(KTR), హరీష్ రావు (Harish Rao) అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో ఏమాత్రం నిజం లేదని, తమకు ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. పదిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతానని, ఇది పూర్తిగా ప్రజల దృష్టి మళ్లించేందుకు చేస్తున్న కుట్రేనని మండిపడ్డారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తనతో పాటు మంత్రులు, బీఆర్ఎస్(BRS) నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. రూ.50 లక్షల నోటుకు ఓటు కేసులో దొరికిన వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే ఇలాంటి రాజకీయ కక్ష సాధింపులు జరుగుతున్నాయన్నారు. 6 గ్యారెంటీల మోసం, 420 హామీలు, సింగరేణి బొగ్గు కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ డ్రామా అని ఫైర్ అయ్యారు. నాలుగు కోట్ల ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రిని వదిలిపెట్టమని, కాంగ్రెస్‌ను బొంద పెట్టేదాకా పోరాటం చేస్తామని హెచ్చరించారు.
కేసులకు భయపడే నాయకత్వం బీఆర్ఎస్ కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. కెసిఆర్ నాయకత్వంలో పదేళ్లు అధికారంలో ఉండి ఎప్పుడూ అక్రమాలకు పాల్పడలేదని, ప్రతిపక్షాలను వేధించే రాజకీయాలు తాము చేయలేదన్నారు. రాష్ట్ర పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఎద్దేవా చేశారు. తనపై డ్రగ్స్, హీరోయిన్‌లతో సంబంధాలు వంటి అసత్య ప్రచారాలు చేశారని, కుటుంబాలను కూడా ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఫోన్లు ట్యాప్ కావడం లేదని పోలీసులు ధైర్యంగా చెప్పగలరా అని ప్రశ్నిస్తూ, డీజీపీ మీడియా ముందుకు రావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దోపిడి దొంగల ముఠా ప్రభుత్వమే నడుస్తోందని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.







