ఇవాళ తెలంగాణ గ్రూప్-1 (Telangana Group-1) వ్యవహారంలో కీలకంగా మారాల్సిన హైకోర్టు (High Court) తీర్పు మరోసారి వాయిదా పడింది. తీర్పు ఇంకా సిద్ధం కాలేదని డివిజన్ బెంచ్ స్పష్టం చేస్తూ, గ్రూప్-1పై ప్రకటించాల్సిన నిర్ణయాన్ని వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసుతో 563 మంది గ్రూప్-1 అధికారుల భవితవ్యం ముడిపడి ఉండటంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. టీజీపీఎస్సీ (TSPSC) 2024లో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ సెలెక్ట్ కాని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ బెంచ్ (Single Bench), సెలెక్షన్ లిస్టును రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని సంచలన తీర్పు ఇచ్చింది. అయితే ఆ తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించడంతో విషయం మరింత క్లిష్టంగా మారింది. గత నెల 30న వాదనలు పూర్తిగా వినిన డివిజన్ బెంచ్ ఇవాళ తుది నిర్ణయం వెల్లడించాల్సి ఉండగా వాయిదా వేయడం చర్చనీయాంశంగా మారింది. తుది తీర్పు ఏ దిశగా వస్తుందన్నది ఇప్పుడు వేలాది మంది అభ్యర్థుల ఆశలు, ఆందోళనలకు కేంద్ర బిందువుగా మారింది.








