వరి కోతల పండుగ అయిన సంక్రాంతిని జరుపుకుంటున్న వేళ, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వ్యవసాయ రంగ భవితవ్యంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి (Retired IAS Officer) పీవీ రమేష్ (PV Ramesh) చేసిన ట్వీట్ తీవ్ర చర్చకు దారి తీసింది. ఒకప్పుడు “అన్నపూర్ణ” (Annapurna)గా దేశానికి ధాన్యం అందించిన ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు వరి ఉత్పత్తి (Paddy Production)లో తెలంగాణ కంటే వెనుకబడిపోయిందని ఆయన గణాంకాలతో సహా వెల్లడించారు. ది ఇండియన్ ఎక్స్ప్రెస్ బయటపెట్టిన గణాంకాలను సూచిస్తూ పీవీ రమేష్ ట్వీట్ చేశారు.
పీవీ రమేష్ తన ట్వీట్లో గత దశాబ్దంలో చోటుచేసుకున్న మార్పులను స్పష్టంగా వివరించారు. 2015లో ఆంధ్రప్రదేశ్లో 74.9 లక్షల టన్నుల వరి ఉత్పత్తి ఉండగా, తెలంగాణ (Telangana)లో అది కేవలం 30.5 లక్షల టన్నులే. కానీ పదేళ్ల వ్యవధిలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఆయన పేర్కొన్నారు. తాజా గణాంకాల ప్రకారం తెలంగాణ వరి ఉత్పత్తి 168.8 లక్షల టన్నులకు చేరి దేశంలోని ప్రధాన ధాన్యాగారంగా అవతరించగా, ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి 73.4 లక్షల టన్నులకు పరిమితమై స్వల్పంగా తగ్గినట్టు వెల్లడించారు.
ఈ వెనుకబాటుకు రైతుల కష్టపడకపోవడమే కారణం కాదని పీవీ రమేష్ స్పష్టం చేశారు. గత దశాబ్దంలో ప్రభుత్వాలు తీసుకున్న విధాన నిర్ణయాలు, ప్రణాళికలు, అమలు లోపాలే ఇందుకు ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది కేవలం గణాంకాల క్షీణత కాదని, వ్యవసాయ రంగంలో నాయకత్వం, వ్యూహం, వేగం, దృష్టి లోపానికి ప్రతిబింబమని వ్యాఖ్యానించారు.
కృష్ణా, గోదావరి డెల్టాలు శతాబ్దాలుగా దేశ ఆహార భద్రతకు ప్రతీకలుగా నిలిచాయని గుర్తు చేసిన ఆయన, అలాంటి రాష్ట్రం ఈ స్థితికి చేరడం ఆత్మపరిశీలనకు దారి తీస్తుందని అన్నారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం ఇప్పటికీ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP)లో 30 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉండటంతో పాటు, 50 శాతం పైగా ప్రజలకు ఉపాధి కల్పిస్తోందని గుర్తుచేశారు.
సంక్రాంతి కేవలం పండుగ వేడుకలకే పరిమితం కాకూడదని, ఇది ఆత్మపరిశీలనకు, కార్యాచరణకు కూడా సరైన సమయమని పీవీ రమేష్ పిలుపునిచ్చారు. ఒకప్పుడు ప్రావీణ్యం సాధించిన వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ ఎందుకు వెనుకబడిందన్న ప్రశ్నకు సమాధానాలు వెతకాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఈ సంక్రాంతికి రైతులను కేవలం నినాదాలతో కాదు, వ్యవసాయ రంగాన్ని పునరుజ్జీవింపజేసే స్పష్టమైన విధానాలు, దీర్ఘకాలిక ప్రణాళికలు, దృఢమైన సంకల్పంతో గౌరవిద్దామన్న ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ, ఆర్థిక వర్గాల్లో విస్తృత చర్చకు కారణమవుతున్నాయి.









